కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్స్ అనుష్క. ఆమెపై రూ.50 కోట్లు పెట్టడానికి కూడా నిర్మాతలు రెడీ అంటున్నారు. దానికి తోడు అనుష్క సినిమా అంటే క్రేజ్ అంతా ఇంతా ఉండడం లేదు. తమిళంలోనూ ఆమె సినిమాలకు మంచి గిరాకీ ఉంది. కానీ ఏం లాభం?? అనుష్కతో భారీ పెట్టుబడి పెట్టి సినిమా తీసినవాళ్లంతా.. పాపర్ అయిపోతున్నారు. రుద్రమదేవి, సైజ్ జీరోకి భారీ నష్టాలొచ్చాయి. అంతకు ముందు వర్ణ సినిమా కూడా అట్టర్ ఫ్లాపే. అందుకే అనుష్క తెగ బాధపడిపోతోందట. ఎక్కడ తనపై ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోతుందో అని తన హైరానా. వసూళ్లూ, విజయాలూ పట్టించుకోవొద్దని, తాను పాత్ర కోసం పడిన కష్టాన్ని చూడమంటోంది జేజమ్మ.
”నా ప్రతి సినిమా ఆడాలనే ఉంటుంది. అందుకోసమే కష్టపడుతుంటా. వర్ణ సినిమా కోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఆ సినిమా సరిగా ఆడకపోవడం నిరుత్సాహాన్ని కలిగించింది. రుద్రమదేవి, సైజ్ జీరోలు కూడా చాలా ప్రేమతో చేసిన సినిమాలు. రుద్రమదేవి కోసం చాలా సినిమాల్ని పక్కన పెట్టా. సైజ్ జీరో కోసం బరువు పెరిగా. నా కష్టాన్ని గుర్తించండి.. ఆ సినిమాలు సాధించిన వసూళ్లు, రికార్డులు కావు. కానీ.. ఈ విషయంలో నాకు అసంతృప్తి తప్పడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది స్వీటీ.