ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచింది అనుష్క. లేడీ ఓరియెంటెడ్ కథల్ని చాలా ప్రత్యేకంగా ఎంచుకుంది. `అరుంధతి` థ్రిల్లర్ అయితే… `పంచాక్షరి` సోషియో ఫాంటసీ. `భాగమతి`, `నిశ్శబ్దం` కూడా థ్రిల్లర్లే. అలాంటి కథలైతేనే సినిమా అంతా తనవైపుకు తిప్పుకునే ఛాన్సుంది. కాబట్టి.. ఆ తరహావి ఎంచుకుంది. అయితే థ్రిల్లర్ సినిమాలు చేసీ, చేసీ విసుగొచ్చిందేమో. ఇప్పుడు రూటు మార్చింది. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంలో నటిస్తోంది.
అనుష్క కథానాయికగా యూవీ క్రియేషన్స్ ఓ సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదీ నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రమే. పి.మహేష్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌లో అనుష్క సినిమా అనగానే, అది కూడా `భాగమతి`లా థ్రిల్లరేమో అనుకుంటున్నారంతా. కానీ.. ఇది ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. నవ్వుతూ.. నవ్విస్తూ.. చివర్లో ఎమోషన్స్ పండించేలా.. అనుష్క పాత్ర ఉంటుందట. ఇప్పటి వరకూ అనుష్క ఈ తరహా పాత్ర చేయలేదని, రొటీన్ కి భిన్నంగా ఉంది కాబట్టే, స్వీటీ ఈ కథని ఒప్పుకుందని తెలుస్తోంది. త్వరలోనే ఈసినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తారు.