జయలలిత పాత్రలో నటించడానికి అనుష్క అవునంటారా? ఒకవేళ అనుష్క కాదంటే ఐశ్యర్యారాయ్ బచ్చన్ అవునంటారా? ఇద్దరిలో జయలలితగా కనిపించేది ఎవరు? తమిళనాట జోరుగా చర్చ జరుగుతోంది. మరో మూడు నెలల్లో ఏదొక విషయాలు తేలుతుంది. అదేంటి? జయలలిత బయోపిక్‌లో నయనతార, త్రిష, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా పేర్లు పరిశీలనలో వున్నట్టు వార్తలు వచ్చాయి కదా? అనుకుంటున్నారా! అదే వేరే బయోపిక్… ఎన్టీఆర్ బయోపిక్ సహా నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి నిర్మించే బయోపిక్ కోసం ఆ నలుగురు పేర్లు వినిపించాయి. అనుష్క, ఐశ్వర్య పేర్లు వినిపిస్తున్నది… ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించే బయోపిక్ కోసం! కొత్తగా తెరపైకి వచ్చిన బయోపిక్ ఇది!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి కథానాయిక జయలలితపై బయోపిక్ తీయాలనుకుని ఆలోచించే దర్శక నిర్మాతల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ అవుతోంది. ‘మదరాసిపట్టణం’, ‘అన్న’, ‘నాన్న’ సినిమాల ఫేమ్ విజయ్ దర్శకత్వంలో నిర్మాత విష్ణు ఇందూరి జయలలిత బయోపిక్ ఒకటి ప్రకటించారు. తమిళంలో మిస్కిన్ అసిస్టెంట్ ప్రియదర్శిని మరొకటి ప్రకటించారు. తాజాగా భారతీరాజా దర్శకత్వంలో ‘అమ్మ – పురట్చి తలైవి’ అని మరో బయోపిక్‌ని ఆదిత్య భరద్వాజ్ అనే నిర్మాత ప్రకటించారు. డిసెంబర్ నెలలో చిత్రీకరణ మొదలు పెడతామని ఆయన తెలిపారు. ఇందులో ఎంజీఆర్ పాత్రకు కమల్ హాసన్‌ని సంప్రతిస్తున్నామని స్పష్టం చేశారు. కమల్ కాదంటేమోహన్లాల్ని మరో ఆప్షన్‌గా పెట్టుకున్నారు. ఇద్దరితోనూ చర్చలు జరుపుతున్నార్ట! ఇంకా జయలలిత మీద ఎంతమంది సినిమాలు ప్రకటిస్తారో? జయలలితపై ఎన్ని సినిమాలు తీస్తారో? చూడాలి.