ఎక్కువ ఎండలో తిరిగితే వడదెబ్బ తగిలి స్పృహ తప్పి పడతారు. ‘భాగమతి’ చిత్రీకరణలో అనుష్క ఆల్మోస్ట్ స్పృహ తప్పి పడిపోయే పరిస్థితి ఎదురైంది. కానీ, ఆమెకు తగిలింది వడదెబ్బ కాదు, దుమ్ము దెబ్బ. సన్నివేశంలో దమ్ము కోసం దుమ్ములో లాక్కుని వెళ్లడంతో అనుష్క చాలా ఇబ్బంది పడిందని ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ చెప్పారు.
‘భాగమతి’ కథ 500 ఏళ్ల పురాతన భవంతిలో జరుగుతుంది. ఎన్నో రోజులుగా ఎవరూ ఆ భవంతిలో ఉండదు. అందువల్ల, భవంతిలో దుమ్ము పేరుకుపోతుంది. ఉన్నట్టుండి ఐఏఎస్ చంచల అలియాస్ అనుష్కను అందులో పడేస్తారు. అక్కణ్ణుంచి బయటకు వెళ్దామంటే భాగమతి ఆత్మ వెళ్లనివ్వదు. నేలపై ఈడ్చుకుంటూ వెళ్తుంది. సన్నివేశంలో సహజత్వం కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ దుమ్మును, అదీ 500 ఏళ్లుగా పేరుకుంటే ఎలా ఉంటుందో అలా సెట్ చేశారట. అనుష్కను ఈడ్చుకుంటూ వెళితే… దుమ్ము పక్కకు జరిగి కిందున్న ఫ్లోర్ కనిపించాలనేది ఆయన ప్లాన్. ఆ సన్నివేశాలు తీసేటప్పుడు అనుష్క ఎంతో ఇబ్బంది పడిందట. ఈ విషయాన్ని రవీందరే చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సినిమా కోసం అనుష్క ఎంతైనా కష్టపడుతుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు.