ప్రభాస్ నటిస్తున్న మరో బహుళ భాషా చిత్రం `ఆది పురుష్`. రావణుడి పాత్రకు సైఫ్ అలీఖాన్ని ఎంచుకున్నారు. సీత పాత్ర కోసం చాలామంది కథానాయికల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో అనుష్క పేరు కూడా ఉంది. సీత పాత్రలో అనుష్క అయితే బాగుంటుందని ప్రభాస్ అభిమానుల మాట. ఎప్పుడైతే సీత పాత్ర కోసం అనుష్క పేరు పరిశీలిస్తున్నారన్న వార్త వచ్చిందో – అప్పుడే ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా మొదలైపోయాయి. `బాహుబలి`తో బాలీవుడ్ లోనూ అనుష్క గుర్తింపు తెచ్చుకుంది కాబట్టి, సీత పాత్రకు స్వీటీ ని ఎంచుకోవడం దాదాపు ఖాయం అనేసుకున్నారు జనాలు.
ఈ విషయమై అనుష్క తొలిసారి స్పందించింది. “ఆదిపురుష్ ప్రాజెక్టులో నటించమని నన్నెవరూ అడగలేదు. అలాంటి ప్రతిపాదన ఏదీ తన దగ్గరకు రాలేద”ని క్లారిటీ ఇచ్చేసింది. తాను తెలుగులో రెండు కొత్త సినిమాల్ని ఒప్పుకున్నానని, అందులో ఆదిపురుష్ లేదని స్పష్టం చేసింది. సీత పాత్ర కోసం కైరా అద్వాణీ, కీర్తి సురేష్ లాంటి పేర్లూ పరిశీలనలో ఉన్నాయి. సౌత్ ఇండియన్ కథానాయికనే సీత పాత్ర కోసం ఎంచుకుంటారని, బాలీవుడ్ భామలెవరూ ఆ పాత్రకు కరెక్ట్ కాదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇప్పటికైతే అనుష్కని ఎవరూ సంప్రదించలేదు. కాకపోతే భవిష్యత్తులో ఈ ఆఫర్ ఆమెను వెదుక్కుంటూ వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.