తన 150వ సినిమా వంద కోట్లు దాటుకెళ్లడం చిరంజీవిలో సరికొత్త ఉత్సాహం వచ్చేసింది. చిరు రీ ఎంట్రీ ఇస్తే జనం చూస్తారా? ఇది వరకటిలా టికెట్ల కోసం ఎగబడతారా? బాక్సాఫీసు దగ్గర కొత్త రికార్డులు నమోదవుతాయా? అంటూ యావత్ తెలుగు చిత్రసీమ ఎదురుచూసింది. వాళ్లందరి అంచనాల్నీ తలకిందులు చేస్తూ ఖైదీ నెంబర్ 150 రికార్డుల వేటలో దూసుకుపోయింది. ఈ ఉత్సాహంతోనే తన తదుపరి సినిమా మొదలెట్టేందుకు సన్నాహాలు చేసేస్తున్నాడు చిరు. ఇప్పటికే తన 151వ చిత్రానికి సురేందర్‌రెడ్డిని దర్శకుడిగా ఎంచుకొన్నాడు. ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహించనున్న సంగతి తెలిసిందే. నిర్మాత, దర్శకుడు ఓకే అయిపోయారు. ఇప్పుడు కథానాయిక ఎంపికే జరగాల్సివుంది.
ఖైదీ నెం.150 కథానాయిక కోసం చిత్రబృందం చాలా కాలం అన్వేషించీ, అన్వేషించీ చివరికి కాజల్‌ని ఎంచుకొంది. ఆ పరిస్థితి రాకుండా ముందుగానే హీరోయిన్ ని ఫిక్స్ చేసుకోవాలని చరణ్ అండ్ టీమ్ ఫిక్సయ్యింది. ఏప్రిల్‌లో షూటింగ్ మొదలెట్టాలన్నది చరణ్ ప్రయత్నం. అప్పటికి కథానాయికలెవరు అందుబాటులో ఉంటారనే విషయంపై చరణ్ ఆరా తీస్తున్నాడు. చిరు పక్కన అనుష్క కథానాయిక అయితే బాగుంటుందని మెగా కాంపౌండ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఖైదీ నెం.150 కోసం అనుష్క పేరే పరిశీలించారు. కానీ తను కాల్షీట్లను సర్దుబాటు చేయలేకపోవడంతో కాజల్‌తో సరిపెట్టుకొన్నారు. ఈసారి ఎలాగైనా అనుష్కని టీమ్‌లోకి చేర్చుకోవాలని చరణ్ భావిస్తున్నాడు. సురేందర్ రెడ్డి తీసేది సొంత కథా, లేదంటే.. పరుచూరి బ్రదర్స్ సిద్ధం చేసిన ఉయ్యాల వాడ నరసింహారెడ్డా? అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. కథ ఏదైనా ముందు హీరోయిన్ని ఫిక్స్ చేసుకోవడం బెటర్ … అన్నది చరణ్ ఆలోచన. సో… అనుష్క నుంచి చిరు కోసం వేట మొదలెడతారన్నమాట.