ప్రేక్షకుల కర్చీఫులు తడిపేసేంత ఏడిపించి, ఇంటికి పంపిన సినిమా.. మాతృదేవోభవ. గుండెల్ని పిండేసే సెంటిమెంట్ అంటామే… అదంటే ఏమిటో రుచి చూపించిన సినిమా అది. `రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే…` పాట ఇప్పటికీ వినిపిస్తుంటుంది. మాధవి అద్వితీయమైన నటన, సంగీతం, పాటలు, ఎమోషన్ ఏరకంగా చూసినా.. ఈ సినిమా శిఖరాన ఉంటుంది. నిర్మాతగా కె.ఎస్.రామారావు అభిరుచికి అద్దం పట్టిన సినిమా ఇది.
ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నార్ట. ఈ విషయాన్ని స్వయంగా కె.ఎస్.రామారావే తెలిపారు. అనుష్క, నయన, కీర్తి, సమంత లాంటి పెద్ద పెద్ద పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మాతృదేవోభవ సీక్వెల్ అంటే.. కచ్చితంగా ఆకర్షణీయమైన విషయమే. కాకపోతే.. అంత హెవీ డ్రామా, ఆ కన్నీళ్లూ ఈతరం చూస్తుందా? చూసి భరిస్తుందా? అన్నదే పెద్ద సమస్య. ఈతరానికి ఏ విషయాన్నయినా, వినోదపు పూత వేసి చెప్పాలి. `మాతృదేవోభవ`కి ఆ ఆస్కారం లేదు. పైగా అప్పట్లో సీరియల్స్ లేవు. ఇప్పుడు ఏ సిరీయల్ చూసినా అలాంటి ఎమోషన్లే. అయినా సరే.. మాతృ దేవోభవ చేద్దామని కూర్చుంటే… కె.ఎస్ రామారావు చెప్పినట్టు స్టార్ హీరోయిన్ అవసరం. అనుష్క, నయన తార లాంటి వాళ్లు ఇప్పుడు ఈ తరహా సబ్జెక్టులు చేసి రిస్క్ తీసుకోలేరు. మరి.. కె.ఎస్.రామారావు ధైర్యం దేనిపైనో..?