ఒకేరోజు రెండు సినిమాలు వస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది. థియేటర్లు మూతబడిన వేళ.. ఒక సినిమా విడుదల కావడమే అద్భుతం అన్నట్టు తయారైంది. అయితే ఈసారి ఓకేరోజు రెండు సినిమాలు ఓటీటీ తెరపై ఆడబోతున్నాయి. అవి.. నిశబ్దం, ఒరేయ్ బుజ్జిగా.
లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడే ముందే ఈ సినిమాలు రిలీజ్‌కి సిద్ధమైపోయాయి. విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. కానీ.. లాక్ డౌన్ వల్ల సినిమాల్ని విడుదల చేయడం సాధ్యం కాలేదు. ఎప్పుడైతే సినిమా విడుదలకు ఓటీటీ ఓ ప్రత్యామ్నాయంగా కనిపించిందో, అప్పటి నుంచీ ఈ సినిమాలూ ఓటీటీలో విడుదల కాబోతున్నాయన్న ప్రచారం మొదలైంది. దానికి తోడు ఓటీటీ ఆఫర్లు కూడా వరుస కట్టాయి. అయితే నిర్మాతలు మాత్రం థియేటర్ల పునః ప్రారంభం కోసం ఎదురు చూశారు. ఎంతకీ ఆ అవకాశం లేకపోవడంతో ఓటీటీకి ఇచ్చేశారు.
అనుష్క ప్రధాన పాత్రధారిగా నటించిన `నిశ్శబ్దం` అక్టోబరు 2న అమేజాన్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమాని దాదాపు 35 కోట్లకు అమేజాన్ కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తెలుగుతో పాటు తమిళ మలయాళ హిందీ భాషల్లోనూ డబ్బింగ్ రూపంలో విడుదల అవ్వడం అమేజాన్‌కి కలిసొచ్చే విషయం. అందుకే అంత రేటు పలికింది. అదే రోజున రాజ్ తరుణ్ హీరోగా నటించిన `ఒరేయ్ బుజ్జిగా ` ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఈ సినిమా కూడా చివరి నిమిషం వరకూ `థియేటర్లలోనే` అంటూ పట్టుబట్టింది. కానీ.. ఓటీటీకి ఇవ్వలేక తప్పలేదు. వారానికి ఏదో ఓ ఓటీటీ వేదికపై ఒక సినిమా రావడం ఈమధ్య రొటీన్ గా మారింది. ఈసారి ఒకేసారి రెండు సినిమాలు వస్తున్నాయి. సాధారణంగా థియేటర్లు ఉన్నప్పుడు ఒకేసారి రెండు సినిమాలు విడుదల అయితే నిర్మాతలకు కష్టంగా తోచేది. సోలో రిలీజ్ దొరకలేదని బాధ పడేవారు. ఈసారి ఆ బాధ తప్పింది.