‘సైరా’ సెన్సార్ అయిపోయింది. ఇక విడుదలే తరువాయి. అక్టోబరు 2 కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈలోగా `సైరా` క్లైమాక్స్‌పై ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలెట్టాయి. ‘సైరా’ క్లైమాక్స్‌లో చిరంజీవి కనిపించడని, తను లేకుండానే అరగంట సేపు కథని నడిపారని వార్తలొస్తున్నాయి.
బ్రిటీష్ వారిపై పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని తెల్లదొరలు ఉరితీస్తారు. అప్పటికీ తమ ప్రతీకారం తీరకపోవడంతో, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తలని కోట గుమ్మానికి వేలాడదీస్తారు. ఆ తల కొన్నేళ్ల పాటు అలానే ఉండిపోయింది కూడా. ‘సైరా’ క్లైమాక్స్ కూడా అంతే. చిరంజీవిని ఉరితీయడంతో ఈ సినిమా ముగిసిపోవాలి. కానీ.. అలా ముగిస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పంచిన స్ఫూర్తి ఎలాంటిదో ఈతరానికి అర్థం కాదు. అందుకే మరికొన్ని సన్నివేశాల పాటు సినిమాని నడిపించాల్సివచ్చింది. సిపాయిల తిరుగుబాటుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం ఎలాంటి స్ఫూర్తినిచ్చిందో, అది భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నాంది ఎలా అయ్యిందో చెబుతూ ఈ కథని ముగించారు. పతాక సన్నివేశాల్లో ఝాన్సీలక్ష్మీబాయ్‌గా అనుష్క ఎంట్రీ ఇవ్వబోతోంది. ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా అనుష్క ఎంట్రీ ఇచ్చి, బ్రిటీష్‌వారిపై పోరాటం సాగించడంతో ఈ కథ ముగియబోతోంది. బయట ప్రచారం జరుగుతున్నట్టు చిరంజీవి లేకుండా అరగంట సినిమానడపలేదు గానీ, చివరి 5 నిమిషాల్లో మాత్రం చిరు కనిపించడు. ఆ సందర్భంలో వచ్చే సన్నివేశాల కోసమే పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అంటే `సైరా` క్లైమాక్స్ అంతా అనుష్క, పవన్లదే అన్నమాట.