లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు స్టార్ హోదా ఇచ్చిన కథానాయికల్లో అనుష్క ఒకరు. ఆమధ్య ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’తో ఆకట్టుకొన్న అనుష్క ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా పూర్తి చేసింది. అదే… ‘ఘాతీ’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ తెలుపుతూ ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అందులో స్వయంగా అనుష్కనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసింది. క్రిష్ కథలన్నీ సామాజిక నేపథ్యంలోనే సాగుతాయి. ఈ సినిమా కథ కూడా అంతే! ఓ బలమైన సామాజిక అంశంతో క్రిష్ ఈ కథను అల్లుకొన్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని సమాచారం. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది. అనుష్కని నెవర్ బిఫోర్ అవతార్‌లో చూశారు ప్రేక్షకులు. అయితే ఈ కథకు సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు. త్వరలోనే ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.
‘హరి హర వీరమల్లు’ చిత్రం క్రిష్ దర్శకత్వంలోనే మొదలైంది. అయితే ఇప్పుడు జ్యోతికృష్ణ ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘వీరమల్లు’ ప్రాజెక్ట్ లేట్ అవ్వడం వల్ల… క్రిష్ దాన్ని మధ్యలోనే ఆపేసి ‘ఘాతీ’ మొదలెట్టారు. ‘వీరమల్లు’ ఇంకా రాలేదు. ఈలోగా ఘాతీ షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలెట్టి, ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించేశారు క్రిష్.