సెలబ్రెటీ హోదా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వాడేసుకోవడానికి ఏమాత్రం ఆలోచించరు సినిమా స్టార్లు. ఓటు వేసేటప్పుడు కూడా క్యూలో ఉండరు. రాచమర్యాదలతో పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్తారు. ఆఖరికి భగవంతుడి దగ్గర కూడా అంతే. వాళ్లకు ప్రత్యేక దర్శనం పక్కా. లైన్లో నిలబడాల్సినంత ఖర్మ వాళ్లకేంటి? అన్నట్టుంటుంది వ్యవహారం. అయితే… అనుష్క మాత్రం ఈ ప్రత్యేక సౌలభ్యాలను పక్కన పెట్టింది. సామాన్య భక్తురాలిగానే క్యూలో నిలబడి, భగవంతుడ్ని దర్శించుకొంది. కర్ణాటక కొల్లూరులోని మూకాంబిక ఆలయాన్ని దర్శించుకొంది అనుష్క కుటుంబం. దర్శనం కోసం మిగిలిన భక్తుల్లానే క్యూలో గంటసేపు నిల్చొన్నారు. ‘మీకు ప్రత్యేక దర్శనం కల్పిస్తాం రండి..’ అంటూ ఆలయ నిర్వాహకులు అనుష్కని ఆహ్వానించినా, స్వీటీ సున్నితంగా తిరస్కరించి లైన్లో నిలబడి మరీ దర్శనం చేసుకుని వెళ్లడం అందరినీ ఆకట్టుకొంది. అనుష్కని చూసైనా.. స్టార్లూ సెలబ్రెటీలూ కాస్తయినా మారతారేమో చూడాలి.
అన్నట్టు అనుష్క గుళ్లో ఎప్పుడైతే కనిపించిందో అప్పుడే ఈ పూజలు అనుష్క పెళ్లి కోసమే అన్నట్టు వార్తలు పుట్టుకొస్తున్నాయి. అనుష్క పెళ్లికి రెడీ అవుతోందని, అందుకే… శాంతి పూజలు నిర్వహించిందంటూ చెప్పుకొంటున్నారు. అనుష్క కుటుంబ సభ్యులు మాత్రం అలాంటిదేం లేదు.. బాహుబలి 2 మంచి విజయాన్ని అందుకొంది.. ఈ సందర్భంగానే ఆలయాన్ని దర్శించి మొక్కు చెల్లించుకొన్నాం.. అంటున్నారు.