స్వీటీ అనుష్క ఓ స్వీట్ షాకిచ్చింది. ఫేస్ బుక్‌లో. తన లేటెస్ట్ ఫొటో ఒకటి అప్లోడ్ చేసింది. అది చూసినవాళ్లంతా.. ‘అనుష్క ఇలా అయిపోయిందేంటి చెప్మా..?’ అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఛేంజ్ ఓవర్ ఆ రేంజులో ఉంది. ‘సైజ్ జీరో’ టైమ్‌లో అనుష్క లావెక్కిపోవడం చూసి ఎంత షాకయ్యారో, ఇప్పుడు సన్నబడడం కూడా అంతే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అనుష్క ఇది వరకటిలా… ఆ మాట కొస్తే అప్పటికంటే సన్నగా తయారైపోయింది. హెయిర్ స్టైల్ కూడా మార్చేసింది. సరికొత్తగా, నవతరం కథానాయికలకు పోటీగా… తనని తాను సిద్ధం చేసుకొంటోంది.
అనుష్క ఈ రూపు సంతరించుకోవడం వెనుక పెద్ద ఎత్తున కష్టపడింది. అహర్నిశలూ ఓ ప్రత్యేక ట్రైనర్ పర్యవేక్షణలో దాదాపుగా 20 కిలోల బరువు తగ్గడానికి ఆరు నెలల సమయం తీసుకొంది. ఈ టైమ్‌లో తన ఆహార నియమాల్ని పూర్తిగా మార్చుకుంది. బయటకు రావడమే మానేసింది. చేతిలో ఉన్న భాగమతిని పూర్తి చేసిన తరవాత… అనుష్క దాదాపుగా ఇంటికీ, జిమ్‌కే పరిమితమైంది. ఈ మధ్య కాలంలో అనుష్క లేటెస్ట్ పిక్ ఒక్కటీ బయటకు రాలేదు. ఇప్పుడే సరికొత్తగా.. ఈ ఫొటో బయటపెట్టింది. ‘సైజ్ సైజ్’ అనుష్కని బాగా ఇబ్బంది పెట్టింది. ఆ సినిమా హిట్టవ్వకపోవడం కంటే, ఆ సినిమా కోసం బరువు పెరగడమే అనుష్కని కలవరపరిచింది. బరువు తగ్గుదామని ప్రయత్నించినా అది నెరవేరలేదు. `బాహుబలి 2`లో పెరిగిన బరువుతోనే కనిపించింది. అనుష్క టైమ్ అయిపోయిందనుకొన్నారంతా. ఇలా లావైపోతే… అంటీ పాత్రలు తప్ప మరేం రావు అని డిసైడ్ అయిపోయారు. తాజా లుక్ మాత్రం విమర్శకుల నోళ్లు మూయించేలా ఉంది. వృత్తిపై అంకితభావం, నిజాయతీ ఉన్న అతికొద్ది మంది కథానాయికల్లో అనుష్క ఒకరు. తన తపన… ఈ లుక్‌లోనూ కనిపిస్తోంది. అందుకే అనేది.. సాహో స్వీటీ… సాహో అని.