సొంత పార్టీ నేతలపైనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగ విద్యార్థిపై వర్ల ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆయనలోని దురహంకారాన్ని బయటపెట్టిందన్నారు. వర్ల వైఖరితో మాదిగలు ఆగ్రహంతో ఉన్నారనీ, వెంటనే క్షమాపణ చెప్పాలని రావెల డిమాండ్ చేశారు. మాదిగలంతా ఉద్యమించేలోగానే తన తప్పును వర్ల దిద్దుకోవాలని సూచించారు. ఇదే సందర్భంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై కూడా రావెల కిశోర్ బాబు విమర్శలు చేశారు. తన నియోజక వర్గంలో ఆయన జోక్యం ఎక్కువ అవుతోందన్నారు. ఎన్టీఆర్ ఈ పార్టీ స్థాపించిన తరువాత దళితులను దగ్గర చేర్చుకున్నారనీ, కానీ ఇప్పుడు అదే పార్టీ దళితుల పట్ల అక్కసు వెళ్లగక్కుతోందనీ, ఈ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేస్తామన్నారు.
రావెల కిషోర్ బాబు వ్యవహారంపై టీడీపీలో కూడా అసంతృప్తి ఉన్న సంగతి తెలిసిందే. మంత్రి పదవి నుంచి ఆయన్ని తప్పించిన తరువాత, పార్టీ నియమాలకు విరుద్ధంగా ఆయన వ్యవహార శైలి ఉంటోందన్న విమర్శలు చాలానే ఉన్నాయి. పార్టీలో తాను చాలా నమ్మకస్తుడుగా ఉండేవాడననీ, కానీ కొంతమంది చెప్పుడు మాటలు విని తన ప్రాధాన్యతను తగ్గించారనేది ఆయన ఆవేదన. దీంతో ఆయన సొంత నియోజక వర్గ అభివృద్ధి పనులపై కూడా శ్రద్ధ చూపడం లేదని సమాచారం. అంతేకాదు, ఇటీవలే రావెల సొంత నియోజక వర్గం మీదుగా జగన్ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా జగన్ రొటీన్ గా చేసే విమర్శలు చేశారు. అయినాసరే, ఆ విమర్శల్ని ఖండిస్తున్నట్టుగా రావుల ప్రతిస్పందించలేదు. ఇదే అంశం చంద్రబాబు వరకూ వెళ్లిందనే గుసగుసలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం సందర్భం వచ్చింది కాబట్టి, మరోసారి మాదిగల అంశంతో వివాదాన్ని రావెల పెద్దది చేసే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికే, రాష్ట్రంలో ఏదో ఒక అంశాన్ని వివాదాస్పదం చేసి, ఆ వివాదానికి మద్దతుగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేసే రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయం ఈ మధ్య అక్కడక్కడా వినిపిస్తోంది. సో.. పరిస్థితి ఇలా ఉంది కాబట్టి, ప్రస్తుతం రావెలలో ఉన్న అసంతృప్తికి ఇతర రాజకీయ శక్తుల ప్రోత్సాహం ఏదో లభిస్తోందా అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.