కొన్ని లక్షల మంది టెన్షన్ పడుతున్న అంశానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటే ముందుకు ప్రభుత్వాలు ఎవరికి చెబుతాయి..?. ప్రజలకే చెబుతాయి. వారు టెన్షన్ పడకుండా చూసుకుంటాయి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం దానికి భిన్నం. టెన్త్ పరీక్షలు వాయిదా వేసినట్లుగా ఏపీ సర్కార్ .. ముందుగా హైకోర్టుకు తెలిపింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణలో భాగంగా ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. దాంతో ఏపీలోని టెన్త్ విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. నిన్నటి వరకూ ఎగ్లామ్స్ పెడతాం.. పెడతాం అని ప్రకటనలు చేసి.. ఇవాళ హఠాత్తుగా హైకోర్టులో వాయిదా వేశామనే ప్రకటన చేయడమే వారు అవాక్కవడానికి కారణం. ప్రభుత్వం ఇత బాధ్యతారాహిత్యంగా.. ప్రజల్ని, విద్యార్థుల్ని ఎందుకు మానసికంగా ఇబ్బంది పెడుతోందన్న అసహనం వారిలో కనిపిస్తోంది.
టెన్త్ పరీక్షలు రద్దు కానీ.. వాయిదా కానీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ నిర్వహించి తీరుతామని ఏపీ సర్కార్ చెప్పింది. అనుకున్నట్లుగానే జూన్ ఒకటో తేదీ నుంచి ఉపాధ్యాయులందరూ స్కూళ్లకు రావాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. వాళ్లు కూడా పరీక్షలు పెట్టమంటున్నారని మీడియాకు చెప్పారు. ఇంతా చేసి.. చివరికి పరీక్షల్ని వాయిదా వేశారు. ప్రస్తుతానికి స్కూళ్లు తెరిచే ఉద్దేశం కూడా లేదని ఏపీ సర్కార్ హైకోర్టుకు చెప్పింది. పరీక్షల వాయిదా, స్కూళ్లు తెరవబోమని అఫిడవిట్ వేయాలని హైకోర్టు ఆదేశించి.. తదుపరి విచారణ జూన్ 18కి వాయిదా వేసింది.
హైకోర్టులో ప్రభుత్వం అలా అఫిడవిట్ వేసిన విషయం మంత్రికి తర్వాత తెలిసిందేమో కానీ.. దాన్ని చూసిన తర్వాత ప్రెస్మీట్ పెట్టారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని.. జులైలో మరోసారి సమీక్షించి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. టెన్త్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయని .. ఉన్నత చదువులకు ఇంటర్, టెన్త్ పరీక్షలు చాలా అవసరమని సురేష్ చెప్పుకొచ్చారు. కేంద్రం కూడా సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోందన్నారు. పరీక్షలు రాయకపోతే ఏమైనా కరోనా రాదని గ్యారెంటీ ఉందా? అంటూ సురేష్ వితండ వాదన చేశారు. మొత్తానికి విద్యార్థులు.. పరీక్షల విషయంలో ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు.. విద్యార్థులను.. తల్లిదండ్రులను టెన్షన్ పెడుతోంది.