కోవిడ్ -19 కేసుల పెరుగుదలలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ మూడో తేదీ ఉదయానికి తెలంగాణను ఆంధ్రప్రదేశ్ దాటేసింది. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరి.. ఆరోగ్య పరంగా.. ప్రజలకు నెగెటివ్ సంకేతాలు పంపింది. నెల్లూరు జిల్లా పాజిటివ్ కేసుల విషయంలో ముందు ఉంది. నెల్లూరు-32మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కృష్ణా జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 20, కడప జిల్లాలో 19, ప్రకాశం జిల్లాలో 17, ప.గో జిల్లాలో 15, విశాఖ జిల్లాలో 14, తూ.గో జిల్లాలో 9 , చిత్తూరు జిల్లాలో 9, అనంతపురంలో 2, కర్నూలులో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. గుంటూరు, కడప జిల్లాల్లోనూ శాంపిల్స్ టెస్టు చేయబోతున్నారు. చాలా పరిమతంగానే టెస్టులు చేస్తున్నప్పటికీ పెద్ద కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూండటంతో అధికారవర్గాల్లోనూ ఆందోళన ప్రారంభమయింది.
తెలంగాణలోనూ.. పాజిటివ్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏప్రిల్ ఏడో తేదీ కల్లా… కరోనా ఫ్రీ స్టేట్ గా చేయాలనుకున్నకేసీఆర్ లక్ష్యానికి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారు గండికొట్టేశారు. ఇప్పుడు బయటపడుతున్న పాజిటివ్ కేసులన్నీ వారివి.. లేదా వారి ద్వారా ఇతరులకు అంటిన కాంటాక్ట్ కేసులే. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 154కి చేరింది. కరోనా కారణంగా ఇప్పటికి 9 మంది మృతి చెందాు. మర్కజ్ వెళ్లొచ్చిన 900 మందిని గుర్తించిన అధికారులు… వారందరికీ టెస్టులు చేస్తున్నారు. ఎనిమిది వందల మంది నుంచి ఇప్పటికే శాంపిల్స్ సేకరించారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 2588కి చేరింది. వీరిలో 156 మంది కోలుకున్నారు. 56 మంది చనిపోయారు. వివిధ రాష్ట్రాల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారి వివరాలు సేకరించించిన ప్రభుత్వం… అలాంటి వారందర్నీ క్వారంటైన్‌కు తరలించింది. లక్షణాలు ఉన్న వారందరికీ ప్రభుత్వాలు టెస్టులు నిర్వహిస్తున్నాయి. దీంతో.. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బయటపడుతున్న పాజిటివ్ కేసుల్లో 90 శాతం మర్కజ్ మసీదు కు వెళ్లిన వారే కావడంతో.. ఆ దిశగా కట్టడి చేసేందుకుప్రయత్నిస్తున్నాయి. ఇతర కేసులు తగ్గిపోవడం.. మంచి పరిణామం అని భావిస్తున్నారు.