తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో రూ కోట్లకు కోట్లను అక్కడి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇప్పుడు కాదు నాలుగైదు నెలల కాదు… స్కాం బయటపడినప్పుడే… దేవికా రాణి అనే అధికారి కోట్ల లీలలను బయట పెట్టారు. ఎవరెవరికి.. ఎంతెంత సొమ్ము ముట్టిందో.. ఎలా ముట్టిందో ఆధారాలతో సహా బయట పెట్టారు. అప్పట్లో ఆమెను అరెస్ట్ చేశారు. ఎవరెవరు స్కామ్లో భాగమయ్యారో.. వారికి ఏ రూపంలో నగదు అందిందో.. ఆ డబ్బులను ఎలా సర్క్యూలేట్ చేశారో కూడా వివరిస్తూ మొత్తం కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత.. మళ్లీ నాలుగు నెలల తర్వాత వారిపై నిఘా ఉంచి.. మరో ఆరుకోట్ల రూపాయలు వెలికి తీశారు. సస్పెండైనా.. దేవికా రాణి అనే అవినీతి మహారాణి.. ఇంకా డబ్బులను ఎలా సర్క్యూలేట్ చేస్తున్నారో కనిపెట్టి.. పట్టుకున్నారు మరో సారి అరెస్ట్ చేశారు.
కానీ ఏపీ ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అధికారులు ఇంత వరకూ ఒక్కటంటే.. ఒక్క రూపాయి అవినీతి సొమ్మును పట్టుకోలేదు. ఈఎస్ఐ నిధులతో కానీ.. వ్యవహారాలతో కానీ ప్రత్యక్షంగా సంబంధం ఉండని… మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర్నుంచి ఈఎస్ఐ డైరక్టర్లు.. మెడికల్ షాప్ యజమానులను కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు.. వందల కోట్లు అవినీతి జరిగిందని ఘనంగా ప్రకటించారు. అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. అలా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కానీ… ఇంత వరకూ.. .ఆ అవినీతికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టలేదు సరి కదా… అచ్చెన్నాయుడుకు డబ్బు ముట్టినట్లుగా ఆధారాలు లేవని.. ఏసీబీ అధికారులు చెప్పడం ప్రారంభించారు. మరి అవినీతి జరిగిందని ఎలా నిర్ధారించారో క్లారిటీలేదు.
అచ్చెన్నాయుడుకు డబ్బు ముట్టినట్లుగా ఆధారాలు లేవు.. సరే మరి ఈఎస్ఐ డైరక్టర్ల విషయంలోనైనా అవినీతి సొమ్మును పట్టుకున్నారా అంటే అదీ లేదు. ఎవరి దగ్గరా అక్రమాస్తులు ఉన్నట్లుగా ఇంత వరకూ ప్రకటించలేదు. ఫలానా ఆధికారి కోట్లకు పడగలెత్తారని.. ఇన్నిన్ని ఆస్తులున్నాయని కానీ చెప్పడం లేదు. అంటే.. వారి దగ్గర కూడా… ఎలాంటి అవినీతికి ఆధారాలు దొరకబుచ్చుకోలేదని.. ఏసీబీ అధికారులు చెబుతున్నారని అనుకోవచ్చు. మరి ఆధారాలు ఉన్నాయని అరెస్టులు చేసిన ఏసీబీ అధికారులు.. ఇప్పుడేం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే… పొరుగు రాష్ట్ర ఏసీబీ . .. అసలు అవినీతి కేసుల్ని ఎలా విచారించాలో చూపిస్తోంది మరి..!. ఇప్పుడు.. ఏపీ ఏసీబీ..తాము చెప్పినట్లుగా వందల కోట్ల అవినీతి సొమ్మును బయటపెట్టాలి.. లేకపోతే ఫెయిల్యూర్ లేదా.. రాజకీయ కుట్రలో భాగమయ్యారని అందరూ నమ్ముతారు.