సత్యం కంప్యూటర్స్ ఎందుకు పతనం అయింది..?. లేని ఆదాయాన్ని చూపించి.. అప్పులను దాచిపెట్టి.. దాన్నే ఆదాయంగా చూపించి.. మరిన్ని అప్పులు తెచ్చి.. ఆ నిధుల్ని దారి మళ్లించి.. ఇతర కంపెనీల్లో పెట్టి.. ఇలా అసంబంద్ధమైన ఆర్థిక విన్యాసాలు చేయడం ద్వారా సత్యం కంప్యూటర్స్ పతనమైంది. చివరికి ఏమీ చేయలేమని తేల్చుకుని… సత్యం చైర్మన్ రామలింగరాజు.. అందరికీ చేసిన తప్పుల గురించి మెయిల్ పెట్టి.. భారం దించేసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది వేరే కథ. అచ్చంగా ఇప్పుడు.. ఇదే తరహా పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనూ కనిపిస్తోందని అర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక పరంగా రెండేళ్ల పాటు ఏపీ సర్కార్ ఏం చేసిందో.. ఏం చేయలేకపోయిందో.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తూండటంతో సత్యం సంస్థ పతనంతో పోలికలు చూస్తున్నారు.
నాటి సత్యం కంపెనీ అకౌంట్స్‌ను తలపిస్తున్న నేటి ఏపీ ప్రభుత్వ లెక్కలు..!
ఏపీ ప్రభుత్వం విపరీతమైన అప్పులు చేసింది. అప్పులుచేయాలంటే… ఎఫ్ఆర్బీఎం చట్టానికి అనుకుణంగానే చేయాలి. స్థూలజాతీయ ఉత్పత్తిని బట్టి అప్పులు తీసుకునే పరిమాణం ఆధారపడి ఉంటుంది. అంత కంటే ఎక్కువ అప్పులు చేస్తే.. అది చట్ట విరుద్ధం అవుతుంది. అయితే ఏపీ సర్కార్.. ఈ ఎఫ్ఆర్బీఎంకు కళ్లకు గంతలు కట్టేసింది. లెక్కకు మిక్కిలి అప్పులు తీసుకొచ్చింది. కానీ ఎక్కడా లెక్కల్లో చెప్పడం లేదు. కార్పొరేషన్లను పెట్టి… కనీసం రూ. 80వేల కోట్లను రెండేళ్లలో తీసుకు వచ్చింది. వీటిని అప్పుల్లో చూపించలేదు. వాస్తవంగా చూపించాల్సి ఉంటుంది. ఆర్బీఐ అడిగినా వివరాలు ఇవ్వడం లేదు. కానీ ఎంతో కాలం దాచి పెట్టలేరు. ఇవ్వాల్సిందే. అదే ఎఫ్ఆర్బీఎం చట్టం కింద తీసుకున్న అప్పుల్లోనూ దొంగ లెక్కలు రాశారు. తెలంగాణ తిరిగి చెల్లించిన అప్పును కూడా తాము చెల్లించినట్లుగా లెక్కలు చూపి.. దాదాపుగా రూ. పద్దెనిమిది వేల కోట్ల అప్పు ఎక్కువగా తెచ్చుకున్నారు. ఇది ఇప్పుడు బయటపడింది. దీంతో ఈ ఏడాది రుణపరిమితిని కేంద్రం కోసేసింది.
అప్పులు గోప్యం.. ఖర్చులు గోప్యం.. అసలు లెక్కలే గోల్ మాల్..!
అదే సమయంలో రూ. 41వేల కోట్ల నిధుల పై వివాదాలు ప్రారంభమయ్యాయి. అసలు ఆ నిధుల్ని ఓచర్లు కూడా లేకుండా చెల్లించేశారని టీడీపీ ఆరోపిపిస్తోంది. కాదు.. సర్దుబాట్లు చేశామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అంత పెద్ద మొత్తంలో సర్దుబాట్లు చేస్తే.. జీతాల చెల్లింపుల కోసం… ఆర్బీఐ దగ్గరకు ప్రతీ మంగళవారం అప్పు కోసం వెళ్లాల్సిన అవసరం ఏముందన్నది ఆర్థిక నిపుణులకు వస్తున్న సందేహం. రూ. 41వేల కోట్లు వివిధ పద్దుల్లో ఉంటే… రూ.రెండు వేల కోట్లను వాటి నుంచిసర్దుబాటు చేసుకోకుండా.. ఉద్యోగాలకు జీతాలు నిలిపివేస్తారా అన్నది ప్రధానంగా వచ్చే సందేహం. ప్రభుత్వం సర్దుబాట్ల విషయంలో పాక్షిక నిజాలే చెబుతోందని.. ఇంకేదో గూడుపుఠాణి ఉందన్న అనుమానాలు అందుకే వస్తున్నాయి.
మొత్తం లెక్కలు తేల్చిన రోజున ఏం జరుగుతుంది..?
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఇప్పుడు.. కాగ్‌తో పూర్తి స్థాయి ఆడిటింగ్ చేయించాలన్న డిమాండ్ పెరుగుతోంది. గత రెండేళ్ల నుంచి అన్ని మార్గాల నుంచి చేసిన అప్పుల వివరాలు చెప్పాలని కేంద్రం అడుగుతోంది. ఏపీ చెప్పడం లేదు. ఇలాగే.. దాగుడు మూతలు ఆడితే.. ఇవాళ కాకపోయినా.. రేపైనా పూర్తి స్థాయిలో ఆడిటింగ్ చేయించడం ఖాయమే. అప్పుడు అసలు విషయాలు వెల్లడవుతాయి. ఇప్పటి వరకూ బయటపడుతున్న ఒక్కో విషయాన్ని చూస్తే.. అప్పటి సత్యం కంపెనీ పరిస్థితే.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఎదురవుతోందన్న అభిప్రాయం మాత్రం.. ఆర్థిక నిపుణుల్లో వినిపిస్తోంది.