ఢీ .. రెఢీ లాంటి సినిమాల్లో బ్రహ్మానందమే సెంటర్ పాయంట్. ఆయనను ముందు పెట్టి సినిమా అంతా నడిపించేస్తారు. కానీ ఆయనమాత్రం నిమిత్తమాత్రుడు. ఇప్పుడు… ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీని కూడా అలాగే వాడుకుంటున్నారనే ప్రచారం సెక్రటేరియట్లో జోరుగా సాగుతోంది. ఎల్వీ సుబ్రహ్మణ్యం కొన్ని నిర్ణయాలపై తన అభిప్రాయాలు చెబుతూండటంతో.. ఆయనను గెంటేసి..హుటాహుటిన నీలం సహానిని తీసుకొచ్చిన ప్రభుత్వం… ఇప్పుడు… ఆమె పేరుపై ఆదేశాలు జారీ చేస్తోంది. దీని అర్థం మొత్తం ఆదేశాలు ఆమెకు తెలుసని.. ఫైల్స్ చూస్తున్నారని.. సంతకం పెడుతున్నారని కాదు. ప్రభుత్వం జారీ చేయాల్సిన ఆదేశాలు.. ఆమె పేరుపై జారీ చేస్తున్నారు. ఇందులో ట్విస్ట్ కొన్ని కీలక ఫైల్స్ ఆమె చూడట్లేదు. ఈ చూడని ఫైల్స్లో.. కర్నూలుకు పాక్షిక న్యాయాలయాల తరలింపు కూడా ఉందంటున్నారు.
సాధారణంగా ఓ స్థాయి వరకూ ఏ ఉత్తర్వులు అయినా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీనే ఇవ్వాలి. కొద్ది రోజుల క్రితం… కర్నూలుకు.. విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ కార్యాలయాలను తరలిస్తూ.. అర్థరాత్రి ఉత్తర్వులువచ్చాయి. అవి కూడా సీఎస్ పేరు మీదే వచ్చాయి. కానీ.. ఆ ప్రక్రియ మొత్తంలో సీఎస్ .. ఎక్కడా జోక్యం చేసుకోలేదని.. అసలు ఒక్క తరలింపు ఫైల్ పై కూడా సీఎస్ సంతకం పెట్టలేదని అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తం.. సీఎంవో ముఖ్య కార్యదర్శిగా.. అలాగే..జీఎడీ కీలక బాధ్యతలు చూస్తున్న అధికారిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్.. చీఫ్ సెక్రటరీ పేరు మీద ఈ ఆదేశాలు జారీ చేసేశారని అంటున్నారు. సాధారణంగా… దేనిపైనైనా ఉత్తర్వులు ఇవ్వాలంటే ఓ ప్రక్రియ ఉంటుంది. నోట్ ఫైల్స్ ఉంటాయి. ప్రతీ దానిపైనా…సీఎస్ సంతకం ఉండాలి. కనీసం ఫైల్ చూశానన్న సంకేతం అయినా ఉండాలి. అవేమీ లేకుండా ఆదేశాలొచ్చాయి.
కార్యాలయాల తరలింపు విషయంలో తాము చెప్పినప్పటికీ..తమ ఆదేశాలను ధిక్కరించారన్న అభిప్రాయం… హైకోర్టులో ఏర్పడితే.. మొదటగా బలయ్యేది చీఫ్ సెక్రటరీనే. ఎందుకంటే.. గతంలో… అధికారుల్నే బాధ్యుల్ని చేస్తామని హైకోర్టు ప్రకటించింది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి చీఫ్ సెక్రటరీ .. తనకు సంబంధం లేదని.. తప్పించుకున్నారని… కానీ ఆమె పేరుపై ఉత్తర్వులు వచ్చేశాయంటున్నారు. ఇప్పుడు.. కోర్టు తీసుకునే చర్యల్ని బట్టి.. సీఎస్ కూడా.. ప్రభుత్వానికి ఎదురుతిరిగి.. ఆ ఆదేశాలతో తనకు సంబంధం లేదని వాదించే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి ప్రభుత్వం … ఏకపక్షంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అధికారవర్గాల్లోనూ.. కలకలం రేపుతున్నాయి.