ఊరంతా ఓ దారి.. ఉలిపికట్టెది మరో దారన్నట్లుగా.. దేశంలో రాష్ట్రాలన్నీ పరీక్షలను రద్దు చేసి.. ఇంటర్నల్ పరీక్షలు.. ఇతర పద్దతుల ద్వారా జీపీఏలు, గ్రేడింగ్‌లు ఇస్తూంటే ఏపీ సర్కార్ మాత్రం పరీక్షలు పెడతామని మంకుపట్టు పడుతోంది. స్వయంగా సుప్రీంకోర్టుకు కూడా తాజాగా పరీక్షలు నిర్వహిస్తామనే అఫిడవిట్ ద్వారా తెలిపింది. పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పరీక్షలు జరపని రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు వివరణ కోరింది. కేరళ, ఏపీ తప్ప అన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తామని తెలిపాయి. కేరళ మాత్రం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు పెడతాం కానీ ఇప్పుడల్లా కాదని.. సెప్టెంబర్‌లో పరిశీలిస్తామని చెప్పింది.
అంటే నికరంగా ఏపీ ఒక్కటే పరీక్షలకుసిద్ధంగా ఉంది. అదే విషయాన్ని తమకు అఫిడవిట్ రూపంలో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేసించింది. ఈ మేరకు ఏపీ సర్కార్ అఫిడవిట్ దాఖలుచేసింది. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని.. కేసుల గురించి వివరించి… పరీక్షలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. జూలై చివరి వారంలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.ఇప్పటికే … పరీక్షల వల్ల ఏ ఒక్క ప్రాణం పోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది కూడా. కరోనా వైరస్ ధర్డ్ వేవ్ ప్రభావం ప్రారంభమైందని.. స్కూల్స్ తెరవడంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని కేంద్రం… స్పష్టమైన సూచనలు చేస్తున్న సమయంలోనే.. ఏపీసర్కార్ పరీక్షల నిర్వహణపై పట్టుదలకు పోతోంది.
అన్ని రాష్ట్రాలు రద్దు చేసినప్పుడు.. ఏపీ సర్కార్ మాత్రమే ఎందుకు పట్టుదలకు పోతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రతిపక్షాలు చాలా కాలం నుంచి పరీక్షల రద్దు కోసం పట్టుబడుతున్నాయి కాబట్టి… ాతము రద్దు చేస్తే.. వారి డిమాండ్‌కు తలొగ్గి రద్దు చేసినట్లు అవుతుందన్న ఉద్దేశంతో పట్టుదలకు పోతున్నట్లుగా విపక్షాలు విమర్శిస్తున్నాయి. మొత్తానికి సుప్రీంకోర్టుకు కూడా.. పరీక్షలు పెడతామనే ఏపీ సర్కార్ చెప్పింది. గురువారం జరగబోయే విచారణలో.. ఈ అఫిడవిట్‌ను చూసి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.