ఓటుకి నోటు కేసులో తెలంగాణా ప్రభుత్వం ఏమి సాధించాలనుకొంటోందో తెలియదు కానీ దాని పని కొండను త్రవ్వి ఎలుకని పట్టుకొన్నట్లుంది. ఆ పనికోసం ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అందులో రూ.52లక్షలు తెలంగాణా ప్రభుత్వం తరపున ఈకేసు వాదిస్తున్న రాంమ్ జేత్మలానీ ఫీజుకే సమర్పించుకొంది. ఇంత ఖర్చు చేసినా ఈ కేసులో ఏమయినా ముందుకు వెళ్ళగలుగుతోందా? అంటే అనుమానమే. పోనీ దోషులకు శిక్ష పడుతుందా? అంటే అదీ అనుమానమే. అటువంటప్పుడు ఈ కేసుపై విలువయిన ప్రజాధనం ఎందుకు వృదా చేస్తోందో ఎవరికీ తెలియదు. తెరాస, తెదేపాల మధ్య నెలకొని ఉన్న రాజకీయ వైరాన్ని ప్రభుత్వాల వరకు ప్రాకించడమే ఒక తప్పు అనుకొంటే దాని కోసం మళ్ళీ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయడం మరో పెద్ద తప్పు. ఒకవైపు తెలంగాణాలో రైతన్నలు కేవలం రెండు మూడు లక్షల అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, తెలంగాణా ప్రభుత్వం తన రాజకీయ కక్షల కోసం ప్రజాధనాన్ని ఈవిధంగా ఖర్చు చేయడం సమంజసమేనా? అని ఆలోచించుకోవాలి.
ఈ విషయంలో తెదేపా ప్రభుత్వం కూడా పోటీ పడుతోంది. ఓటుకి నోటు కేసు నుండి తనను తాను రక్షించుకొనేందుకు అది కూడా లాయర్లకు భారీగానే ముట్టజెప్పుతోంది. పైగా ఈ కేసులో తెలంగాణా ప్రభుత్వాన్ని నిలువరించేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటపెట్టి దానిపై విచారణ, కోర్టు కేసుల కోసం చాలా విరివిగానే డబ్బు ఖర్చు చేస్తోంది. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అస్సలు బాగోలేదని తరచూ చెప్పే తెదేపా ప్రభుత్వం మరి ఈ కేసుల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడాన్ని ఎవరూ సమర్దించలేరు.
కేవలం తెలంగాణా రాష్ట్రంలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని మభ్య పెట్టుకోవడానికి లేదు. ఒక్క అనంతపురం జిల్లాలోనే గత ఏడాదిన్నర కాలంలో 80మంది రైతులు ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్నారని వైకాపా వాదిస్తోంది. మూడు నెలల క్రితం ఆ రైతు కుటుంబాలను పరామర్శించడానికి జగన్ బయలుదేరినప్పుడు, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వారి నష్టపరిహారం పెంచుతూ ఒక జి.ఓ. జారీ చేయడం గమనిస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని దృవీకరించినట్లే అయింది. రెండు రాష్ట్రాలలో రైతన్నలు ఆర్ధిక సమస్యలతో సతమతమవుతూ ఆత్మహత్యలు చేసుకొంటుంటే, ప్రభుత్వాలు ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల కోసం లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చు చేయడం జవాబుదారీతనం లేకపోవడం..బాధ్యతా రాహిత్యమేనని చెప్పక తప్పదు. వాటిని నిలదీయవలసిన ప్రతిపక్ష పార్టీలు శవరాజకీయాలతో కాలక్షేపం చేస్తుండటం చాలా శోచనీయం.