ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల మద్య త్వరలో మరో యుద్దం జరుగబోయే సూచనలు కనిపిస్తున్నాయి. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న నాగార్జున సాగర్ కుడికాలువ గేట్లని నేటికీ తెలంగాణా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఆ కారణంగా ఆ గేట్ల నుంచి నీటి విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలంగాణా ప్రభుత్వం చుట్టూ తిరుగవలసి వస్తోంది. కానీ వారు సహకరించకపోవడంతో నీటి విడుదల తరచూ ఆలస్యం జరుగుతోంది. ఇరు రాష్ట్రాల అధికారుల మద్య తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. కనుక నాగార్జున సాగర్ కుడికాలువ గేట్ల నిర్వహణ బాధ్యత నుంచి తెలంగాణా ప్రభుత్వం తప్పుకొని వాటిని తమకి అప్పగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాయాలనుకొంటోంది. అందుకు తెలంగాణా ప్రభుత్వం అంగీకరిస్తే పరువాలేదు లేకుంటే పోలీసుల సహాయంతోనైనా కుడికాలువ గేట్లని తన అధీనంలోకి తెచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు దాని అనుకూల మీడియాలో ఒక వార్త వచ్చింది.
కుడికాలువ గేట్లని ఆంధ్రప్రదేశ్ కి అప్పగించినట్లయితే సాగర్ జలాశయంపై తెలంగాణా ప్రభుత్వం తన పట్టుకోల్పోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకి ఎంత నీరు అవసరం ఉంటే అంతా యధేచ్చగా విడుదల చేసుకోగలుగుతుంది. దాని వలన జలాశయంలో నిలవున్న నీటి వాడకం తగ్గిపోతుంది కనుక మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య మరో సమస్య రావచ్చు. కనుక తెలంగాణా ప్రభుత్వం కుడి కాలువ గేట్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించకపోవచ్చు. ఈ విషయంలో కృష్ణా, గోదావరి రివర్ బోర్డు కూడా కలుగజేసుకోకతప్పదు. లేకుంటే ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య మళ్ళీ మరోమారు యుద్ధం జరిగే ప్రమాదం ఉంటుంది.