పాలమూరు, డిండి ప్రాజెక్టులపై సుప్రీం కోర్టు నిన్న ఇచ్చిన తీర్పుని ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు రెండూ కూడా స్వాగతించడం చాలా విశేషమనే చెప్పాలి.
ఏపి నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దానిపై స్పందిస్తూ సుప్రీం కోర్టు తీర్పుని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఈ సమస్యని పరిష్కరించాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్నామని కనుక కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమా భారతి తక్షణం చొరవ తీసుకొని అపెక్స్ కౌన్సిల్ ని ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సుప్రీం తీర్పుపై స్పందిస్తూ “సుప్రీం కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాను. ఈ తీర్పుతో పాలమూరుకి పట్టిన శని విరగడ అయింది. ఆ ప్రాజెక్టుకి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కనుక ఇకపై ఈ ప్రాజెక్టుని రాకెట్ స్పీడుతో పూర్తి చేసి రంగారెడ్డి జిల్లా ప్రజలకి నీళ్ళు అందిస్తాము,” అని అన్నారు.
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని రెండు రాష్ట్రాల మంత్రులు తమకి అనుకూలంగా అన్వయించుకొని ఈవిధంగా మాట్లాడటం చాలా విచిత్రంగా ఉంది. ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి మొదటినుంచి అభ్యంతరం చెపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిపై చర్చించేందుకు అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరుతోంది. కానీ దానిపై కేంద్రం ఆలస్యం చేస్తుండటంతో ఈవిధంగా వ్యక్తిగత పిటిషన్ వేయించి, అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకి సుప్రీం కోర్టు ద్వారా కేంద్రంపై ఒత్తిడి చేయించిందనుకొంటే అది అనుకొన్న ప్రయోజనం నెరవేరినట్లే.
కానీ సుప్రీం తీర్పుపై కెసిఆర్ స్పందన చూస్తే ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న అవరోధాలని సుప్రీం కోర్టు తొలగించి వాటి నిర్మాణానికి అనుమతి మంజూరు చేసినట్లు మాట్లాడటం విశేషం. ఈ ప్రాజెక్టులకి అపెక్స్ కౌన్సిల్లో చర్చలు, దాని అనుమతి కూడా అవసరం లేదన్నట్లుగానే ఉన్నాయి ఆయన మాటలు. కృష్ణా గోదావరి బోర్డులు నీటి పంపకాల సమస్యలని పరిష్కరించలేక ఏవిధంగా చేతులు ఎత్తేస్తున్నాయో, ఈ అపెక్స్ కౌన్సిల్ కూడా అదేవిధంగా ఈ ప్రాజెక్టులని అడ్డుకోలేక ఒక డమ్మీ కౌన్సిల్ గా మిగిలిపోతుందని ఆయన అభిప్రాయపడుతున్నట్లున్నారు. కెసిఆర్ స్పందనపై మరి ఏపి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.