రెండు రాజకీయపార్టీల సంబంధాన్ని కార్యకర్తలు వ్యతిరేకించిన సందర్భాలు వున్నాయి. నాయకులు విబేధించిన సంఘటనలు వున్నాయి. ప్రజలు ఓడించిన చరిత్రలు వున్నాయి. అయితే ఈ రిలేషన్ షిప్ అవమానకరమని ప్రజలే ఈసడించుకుంటున్న పరిస్ధితి ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఇంకెక్కడా కనబడదు.
ఆంధ్రప్రదేశ్ ను అన్నివిధాలా ఆదుకుంటామని రెండేళ్ళుగా నమ్మబలుకుతున్న బిజెపి నాయకులవన్ని దొంగమాటలేనని ఎన్ డిఎ ప్రభుత్వం మూడవ బడ్జెట్ కూడా లెక్క తేల్చేసింది. ప్రజల ఆశ…రెండేళ్ళలో ఆవిరైపోయింది. ధైర్యం దిగులులాగ ముఖాన్ని కమ్ముకుంది. వెలుగులాగ మసకబారింది. దీపంలాగ కొడిగట్టిపోయింది. అన్యాయమైపోయిన నిస్సహాయులకు దొరికే ఆశ నెరవేరకపోయినా కూడా అలాంటి భరోసా ఇచ్చిన వారి మీద ప్రేమను జీవితాంతం మరచిపోకపోవడమే ప్రజాసామాన్య లక్షణం. ఈ పాటి ఇంగితమైనా లేని బిజెపి ఆశను మోసంగా మార్చేసింది. పెంచుకుంటున్న ప్రేమను మెడపట్టి గెంటేసింది.
కాంగ్రెస్ ఆంధ్రాకు కేవలం అన్యాయమే చేస్తే బిజెపి నమ్మక ద్రోహమే చేసింది.
చట్టంలో లేని ప్రత్యేక హోదా హామీని మరచిపోవచ్చు! ఐదేళ్ళు కాదు పదేళ్ళు ప్రత్యేక హోదా వుండాలని రాజ్యసభలో రంకెలేసిన వెంకయ్య నాయుడువి దొంగమాటలేనని సరిపెట్టుకోవచ్చు! పార్లమెంటులో బిజెపి సహకారం లేకపోతే రాష్ట్రాన్ని ఏకపక్షంగా చీల్చడం కాంగ్రెస్ కి కుదిరేది కాదు. ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలను బిజెపి అటక ఎక్కించడం చూస్తే ఏడుస్తున్న జనాన్ని తొక్కుకుంటూ అధికారం ఎక్కిన బిజెపి నికృష్టతను అసహ్యించుకోవచ్చు.
రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకి నిధులు, వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక నిధులు కేంద్రం ఇచ్చే దయాదాక్షిణ్యాలు కాదు. అవి విభజన చట్టం ప్రకారం రావలసినవే. బడ్జెట్ లలో రాజధాని ప్రస్తావనే లేదు. మిగిలిన రెండు అంశాలలో నీళ్ళలో ముంచిన వేలు విదిలిస్తున్నట్టు కేటాయించిన నిధుల పరిణామాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ కి చేసేదేమీలేదని కేంద్రం స్పష్టం చేస్తోందని అర్ధమౌతోంది.
కేంద్రం సహాయ నిరాకరణ వల్ల రాష్ట్రప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఇంతవరకూ ప్రాధేయపడి ఇప్పుడు వత్తిడి చేసినంత మాత్రాన కేంద్రం నిధుల వర్షం కురిపిస్తుందనుకోలేము.
తెలుగుదేశం ఇప్పటికైనా వాస్తవాలను ప్రజల ముందుంచి అఖిలపక్షాలను కూడగట్టి కేంద్రప్రభుత్వ ద్రోహాన్ని ఎండగట్టడం ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈ లాభనష్టాలను తాను మాత్రమే అనుభవించాలనుకోవడం రాజకీయ ప్రక్రియ. ఈ రాజకీయంలో మధ్యంతరంగా ఎన్నికలకు వెళ్ళడమే గత్యంతరం. గెలిచినా ఓడిపోయినా ఆత్మగౌరవంతో బయటపడాలంటే తెలుగుదేశం ముందున్న మార్గం ఇదే!
బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు చట్టబద్ధంగా ఇవ్వవలసిన నిధులు కూడా కేటాయించని నేపధ్యంలో ఆరో తేదిన రాజమండ్రిలో అమిత్ షా సభకు సన్నాహాల్లోవున్న ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులకు, కార్యకర్తలకు నిరుత్సాహంగా వుంది. ఇలాంటప్పుడు ప్రజల్ని ఫేస్ చెయ్యడం కొంత ఇబ్బందికరమే అని ఇద్దరు ముఖ్యులు అన్నారు.
మైత్రి నటిస్తూ పరస్పరం సహకరించుకోని పరిస్ధితి కేవలం తెలుగుదేశం, బిజెపి పార్టీల సొంత లాభనష్టాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ భరించవలసి వస్తోంది. ఈ అవమానాన్ని ఆంధ్రప్రదేశ్ మోయవలసి వస్తోంది. ఓట్లు వేసేవరకే ప్రజల బాధ్యత, ఎన్నికయ్యాక తమదే ఇష్టారాజ్యం అనుకుంటున్న బిజెపి వైఖరి వల్లా, ఎంతకాలం నెరవేరని మాటలు..అని నిలదీయలేని తెలుగుదేశం తటపటాయింపువల్లా తలఎత్తి శృతిమించుతున్న ఈ పరిస్ధితి …రాజకీయంగా తటస్ధులుగా వుండే ప్రజల్లో కూడా ఏదో ఒక పార్టీ పట్లా లేదా రెండు పార్టీల పట్లా ఈసడింపు భావనను పెంచుతూంది.