ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. ఈరోజు సమావేశాలు మొదలవగానే వైకాపా ఎమ్మెల్యే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ వైకాపా సభ్యులు సభలో నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేసారు. సభను రెండు సార్లు వాయిదా వేసినప్పటికీ పరిస్థితి సద్దు మణగకపోవడంతో స్పీకర్ డా. కోడెల శివ ప్రసాదరావు సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించేరు. ఈ మూడు రోజులలో సభలో అధికార ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు వ్యక్తిగత స్థాయిలో విమర్శలు గుప్పించుకోవడం మినహా రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడే ఒక్క సమస్యకు కూడా పరిష్కారం కనుగొనలేకపోయారు. అలాగే ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకొన్న ఐదు బిల్లులు కూడా పక్కన పెట్టవలసి వచ్చింది. మిగిలిన మూడు రోజులు కూడా సభ ఇలాగే సాగే సూచనలు కనిపిస్తున్నాయి.