రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను హైదరాబాద్ లోనే నిర్వహించాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. మొదట గుంటూరులోని హైదరాబాద్ ల్యాండ్ రిసార్టులో కానీ కే.ఎల్.ఎం. యూనివర్సిటీలో గానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కానీ ప్రధానప్రతిపక్షమయిన వైకాపా అందుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పదేళ్ళపాటు హైదరాబాద్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకొనే అవకాశం ఉన్నప్పుడు, ప్రజాధనం వృధా చేసి ప్రైవేట్ హోటల్స్ లో యూనివర్సిటీలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించవలసిన అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించింది. ప్రైవేట్ హోటల్స్ లో యూనివర్సిటీలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వలన చట్ట సభల గౌరవ ప్రతిష్టలకి భంగం కలుగుతుందని, కనుక తాము దానికి అంగీకరించబోమని తెలిపింది. బహుశః అందుకే ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచించుకొని హైదరాబాద్ లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకొన్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ నిర్వహించబోతున్నారనే దానిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటన చేయవలసి ఉంది.