నేటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు మొదలుకాబోతున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకి ఉభయసభలను ఉద్దేశ్యించి గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. మొత్తం 18రోజుల పాటు ఈ సమావేశాలు సాగుతాయి. మార్చి 10వ తేదీన ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు 2016-17 సం.లకు రాష్ట్ర ఆర్ధిక బడ్జెట్ ని సభలో ప్రవేశపెడతారు. మార్చి 13న వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు.
ఎనిమిది మంది వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి తీసుకుపోవడంపై తెదేపా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వైకాపా ఈ సమావేశాలలో మొదటి రోజు నుంచే తెదేపా ప్రభుత్వం యుద్ధానికి దిగబోతోంది కనుక ఈసారి ఇరు పార్టీల నేతల వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణలతోనే ఈ సమావేశాలు ముగియవచ్చును. ఈ సమావేశాలలో రాజధానిలో భూకుంభకోణం గురించి ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నామని వైకాపా ముందే ప్రకటించింది కనుక ఆ పార్టీ సభ్యులను నిలువరించేందుకు తెదేపా కూడా ప్రతివ్యూహం సిద్దం చేసుకొనే ఉంటుంది.
ఈ సమావేశాలలో స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై, తెదేపా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వైకాపా సిద్దం అవుతోంది. కాపులకు రిజర్వేషన్లు, వైకాపా ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకి ప్రోత్సహించడం వంటి అంశాలపై ప్రభుత్వంతో యుద్ధానికి సిద్దం అవుతోంది. తెదేపాలో చేరిన 8మంది వైకాపా ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించేందుకు లేదా వారిపై అనర్హత వేటు వేసేందుకు కూడా వైకాపా స్పీకర్ పై ఒత్తిడి చేయబోతోంది కనుక సమావేశాలలో యుద్ధవాతావరణం కనిపించవచ్చును.
గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాత ఉభయ సభల బిజినెస్ అడ్వయిజరీ కమిటీలు సమావేశమయ్యి ఈ సమావేశాలలో చర్చించాల్సిన అంశాలపై అజెండాను తయారు చేస్తాయి. కనుక అక్కడి నుండే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధం మొదలవవచ్చును. ప్రజా సమస్యల పరిష్కారానికి, బిల్లుల ఆమోదానికి సమావేశం కావలసిన చట్టసభలు ఈవిధంగా అధికార, ప్రతిపక్షాలకు ఒక యుద్ధవేదికగా మారుతుండటం చాలా దురదృష్టకరం. ప్రజాసమస్యలను చట్ట సభలలో చర్చించాల్సిన ప్రజా ప్రతినిధులు వ్యక్తిగత స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసుకొంటూ విలువయిన ప్రజాధనం, సభ సమయం వృధా చేస్తుంటే దానిని ఆపగలిగే శక్తి వారిని ఎన్నుకొన్న ప్రజలకి కూడా లేదు కనుక వారి యుద్ధాన్ని నిస్సహాయంగా చూడకతప్పదు.