రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ నిన్న ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దానిలో ముఖ్యాంశాలు:
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా ప్రకటించాలి.
2. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకి, ఆర్ధికాభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ప్రకటించాలి.
3. విభజన చట్టంలోని సెక్షన్: 46(3) ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజిని మంజూరు చెయ్యాలి.
4. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం ప్రాజెక్టు కోసం 2014-15సం.లలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1,607 కోట్లు, 2015-16సం.లలో ఖర్చు చేసిన రూ.2,485 కోట్లను కేంద్రప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి.
5. శాసనసభలో సీట్ల సంఖ్యను 175 నుంచి 225కి పెంచుతూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలి.
6. అమరావతిలో పరిశ్రమల స్థాపనకు 100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలి.
ఇంతవరకు కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి చేసిన సహాయానికి తీర్మానంలో శాసనసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై సభలో జరిగిన చర్చలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “ఇదివరకు కూడా మనం ఒకసారి ఇలాగే తీర్మానం చేసి పంపాము. అదేమయ్యిందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు మరో తీర్మానం చేస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండేళ్ళుగా ఇదే రీలు చూపిస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు తప్ప కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదు. రెండేళ్ళు పూర్తి కావస్తున్నా కేంద్రం తన హామీలు నిలబెట్టుకోలేదు. అయినా ముఖ్యమంత్రి కేంద్రాన్ని గట్టిగా నిలదీసి అడిగే దైర్యం చేయలేకపోతున్నారు. అందుకు నిరసనగా కనీసం తన ఇద్దరు కేంద్రమంత్రుల చేత రాజీనామాలు చేయించలేకపోతున్నారు. అపుడప్పుడు ఇలాగ శాసనసభలో తీర్మానాలు చేసి చేతులు దులుపుకొంటున్నారు అంతే. దీని వలన ఒరిగేదేమీ ఉండదని తెలిసి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దీనికి మద్దతు పలుకుతున్నాము,” అని అన్నారు.