ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కరువుపై చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కారణం మీరంటే.. మీరని ఆరోపణలు చేసుకున్నాయి. రుణమాఫీపై చర్చించారు. వడ్డీ లేని రుణాలపై చర్చించారు. విత్తనకష్టాలపై చర్చించారు. వర్షాల లోటుపై కూడా చర్చించారు. కానీ.. అంతా జరిగిన ఓ లోటు కనిపించింది. ఎక్కడా ఈ కరువు కాలంలో రైతులు ఏం సాయం చేయాలన్నదానిపై చర్చ జరగలేదు. గత ప్రభుత్వం వైఫల్యాలను… అధికారపక్షం ఏకరువు పెట్టింది. సమస్యలు పరిష్కరించడం చేతకాకే.. తమపై నిందలేస్తున్నారని.. విపక్షం కౌంటర్ ఇచ్చింది. ఇక రైతులకు ఏర్పడిన విత్తన సంక్షోభంపై.. కూడా అసెంబ్లీలో చర్చించారు. గత ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడం వల్లే ఇప్పుడు రైతులకు కష్టాలని అధికారపక్షం విమర్శలు గుప్పిస్తే… విత్తనాలే ఇవ్వలేకపోతున్నారు.. ఐదేళ్లు ఏం పరిపాలిస్తారని.. విపక్షం ఎద్దేవా చేసింది. ఇవి మాత్రమే కాదు… ఇన్ పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీకి రుణాలు, రైతుల ఆత్మహత్యలపై కూడా చర్చ జరిగింది.
టీడీపీ హయాంలో.. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వాలని.. నిర్ణయించినట్లు జగన్ సభాముఖంగా ప్రకటించారు. మరి వైఎస్ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 14వేల మంది సంగతేమి చేశారని టీడీపీ ప్రశ్నించింది. అయితే.. ఈ చర్చలో.. ప్రభుత్వం కరువు తీవ్రంగా ఉందని అంగీకరించింది. 48శాతం వర్షపాతం లోటు ఉందని.. సీఎం చెప్పారు. అందుకే… తాగునీటి అవసరాలు తీర్చేందుకు నియోజకవర్గానికి కోటి రూపాయలు చొప్పున విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకూ ఇస్తామన్నారు. ఇదొక్కటే అసెంబ్లీ వేదికగా చర్చల ద్వారా వచ్చిన పరిష్కారం.
ఈ కరువు కాలంలో.. రైతులకు ఎలాంటి సాయం చేయబోతున్నారో ప్రభుత్వం ప్రకటించలేకపోయింది. అదే సమయంలో.. రైతులకు ఏం చేస్తారో చెప్పాలని విపక్షం పట్టుబట్టలేకపోయింది. అధికారపక్షానికి కౌంటర్ ఇవ్వడానికే సరిపోయింది. మొత్తంగా.. రైతులకు.. ఈ కరువు కాలంలో ఈ చర్యల ద్వారా అండగా ఉంటామని మాత్రం… ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోయింది. విపక్షం అలాంటి భరోసా ఇప్పించలేకపోయింది. ఒక్కో సందర్భంలో.. ఒకరు ఆరోపణలు చేస్తే.. మరొకరు తిప్పికొట్టుకోవడానికే సమయం కేటాయించారు. కానీ..నిజంగా రైతు సమస్యలకు పరిష్కారం చూపుదామనే ప్రయత్నం మాత్రం జరగలేదు.