అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెడతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. నిజానికి అసెంబ్లీ సమావేశాలు ఈ నెలలోనే నిర్వహించాలనుకుననారు. కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉంది. సాధారణంగా వర్షా కాల సమావేశాలను సెప్టెంబర్ .. అక్టోబర్‌లో నిర్వహిస్తూ ఉంటారు. జగన్ సర్కార్ ఎప్పుడూ ముందు నిర్వహించలేదు. చివరి క్షణంలో తప్పదనుకున్నప్పుడే నిర్వహించారు. అయితే విచిత్రంగా ఈ సారి ముందే నిర్వహించాలని అనుకున్నట్లుగా ప్రచారం జరిగింది.
గతంలో గవర్నర్‌ను కలిసినప్పుడు జగన్ అదే చెప్పారని..ఈ సమావేశాల్లో కీలక బిల్లులు పెట్టబోతున్నామని చెప్పినట్లుగా వైసీపీ అనుకూల మీడియా వర్గాలు ప్రకటించాయి. కీలక బిల్లులు అంటే వైసీపీకి మూడు రాజధానులు మినహా మరొకటి లేదు. అదే సమయంలో వైసీపీ ప్లీనరీలో కూడా తమ విధానం మూడు రాజధానులు అని ప్రకటించారు. మళ్లీ అసెంబ్లీలో బిల్లు పెడతామన్నట్లుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు పెట్టడం సరి కాదన్నట్లుగా ఆగిపోయినట్లుగా తెలుస్తోంది.
అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది. ప్రభుత్వం ఇంకా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయలేదు. న్యాయపరంగా ఎలాంటి చాన్స్‌లు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే అప్పీలుకు వెళ్లలేదని భావిస్తున్నారు. ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్ని మరోసారి ఎలా తెరపైకి తేవాలన్నదానిపై మేథోమథనం జరిపి ఓ మార్గాన్ని కనిపెట్టారని అంటున్నారు. ఎన్నికల మూడ్‌ను క్యారీ చేసేందుకు సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు పెట్టి మూడు రాజధానుల బిల్లు పెట్టే అవకాశం ఉంది. అదే విషయాన్ని గుడివాడ అమర్నాథ్ చెబుతున్నారు.