సమయం.. సందర్భం లేదు.. అసెంబ్లీలో ఏ టాపిక్ వచ్చినా.. మొదటగా చంద్రబాబు వద్దకే వెళ్తుంది. అది ప్రశ్నోత్తరాల్లో చర్చించుకుని పేదల ఇళ్ల గురించి అయినా… ప్రత్యేకగా చేసే చట్టం విషయంలో అయినా.. ముందుగా చంద్రబాబు గురించే చెబుతారు. ఆ తర్వాత చట్టం గురించి చెప్పినా.. చెప్పకపోయినా… పట్టించుకునే అవసరం లేదన్నట్లుగా చర్చ సాగిపోతుంది.
గొప్ప బిల్లులను పాస్ చేశారు..కానీ అర్థవంతమైన చర్చ ఏది..?
ఏపీ సర్కార్ ప్రతీ అసెంబ్లీ సమావేశాల్లోనూ.. చరిత్రను మార్చేయగల స్థాయి చట్టాలను తీసుకొస్తున్నామని ప్రకటిస్తోంది. ఎక్సైజ్ చట్టం, దిశ చట్టం సహా చాలా చట్టాలను చేసింది కనీ.. వాటిలోని విశేషాలను… వాటి వల్ల ప్రజలకు కలిగే ఉపయోగాలను చర్చ సందర్భంగా… ప్రజల ముందు ఉంచే ప్రయత్నాలు తక్కువే జరిగాయి. చంద్రబాబును విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. బహుశా.. అలాంటి వ్యూహం వల్ల రాజకీయ మైలేజీ బాగా వస్తుందని.. వైసీపీ వ్యూహకర్తలు అంచనా వేసుకున్నారేమోననే అభిప్రాయం.. రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. కొత్త చట్టాలకు చంద్రబాబు హయాంలోని పాలనను పోల్చి చూసి.. ఆ ప్రకారం విమర్శలు చేస్తే.. సందర్భోచితమైన చర్చ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ.. వైసీపీ సభ్యులు.. చంద్రబాబు హయాంలో వైఫల్యం అంటారు కానీ.. దానిపై లోతుగా చర్చించరు. వ్యక్తిగత విమర్శలుక వెళ్లిపోతున్నారు. దాంతో… చర్చ పక్కదారి పడుతుంది. ప్రతిపక్ష నేతను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్న అభిప్రాయం.. అసెంబ్లీ సమావేశాలను చూసేవారికి వస్తోంది.
టీడీపీ వ్యూహాల్లో ఇరుక్కుంటున్నామని ముందు జాగ్రత్త పడుతున్నారా..?
తిరుగులేని సంఖ్యాబలం ఉన్నా అధికార పార్టీకి … సమావేశాలు అంత సులువుగా లేవు. కొన్ని కొన్ని సందర్భాల్లో తమ తప్పు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతోనే అసహనం పెరిగిపోయిందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది. సన్నబియ్యం అంశంపై.. సభలో చర్చ జరిగినప్పుడు.. టీడీపీ కార్నర్ చేసింది. తన విధానాన్ని కవర్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తంటాలు పడ్డారు. చివరికి ఎవరూ ఊహించని విధంగా ఇరుక్కుపోయారు. తన సాక్షి పత్రిక తప్పు రాసిందని చెప్పడమే కాదు.. ఇతర పత్రికలు చదవితే నిజం తెలుస్తుందని చెప్పుకొచ్చారు. నిజానికి జగన్ నోటి వెంట అసలు ఇలాంటి మాట వస్తుందని ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే.. ఆయన దృష్టిలో సాక్షి మాత్రమే.. సత్యం రాస్తుంది.. మిగతా పత్రికలు అసత్యాలే రాస్తాయి. కానీ.. ఆయన మొదటి సారి.. చట్టసభలో సాక్షి తప్పు రాసిందని ఒప్పుకున్నారు. ఒప్పుకోవడమే కాదు.. తాను ద్వేషించే ఇతర పత్రికల్ని చదవాలని బహిరంగంగా సూచించారు.
చంద్రబాబును టార్గెట్ చేస్తేనే పొలిటికల్ మైలేజీ వస్తుందా..?
ఒక్క సన్నబియ్యం విషయంలోనే ఇంగ్లిష్ మీడియం వ్యవహారంలోనూ సాక్షి మీడియాతే తప్పనాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి అసహనం కట్టలు తెంచుకుంది. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగారు. తర్వాత…రోజు అసలు చర్చంశాల్ని పక్కన పెట్టి.. చంద్రబాబు మార్షల్స్ ని అన్ పార్లమెంటరీ పదంతో తిట్టారని.. మూడున్నర గంటల పాటు చర్చ పెట్టారు. చంద్రబాబు ఆ మాట అనకపోవడం… ఆ అన్‌పార్లమెంటరీ పదాన్ని జగన్ పదే పదే సభలో ప్రస్తావించడంతో.. టీడీపీ ప్రివిలేజ్ నోటీసు కూడా ఇచ్చింది. ఇలాంటి సెల్ఫ్ గోల్స్ చేసుకోకుండా.. చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శిస్తే సరిపోతుందన్న అభిప్రాయానికి అధికారపక్షం వచ్చేసినట్లుగా కనిపిస్తోంది.