నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. కానీ కేవలం ఐదు రోజులు అంటే ఈనెల 22 వరకు మాత్రమే ఈ సమావేశాలు జరుగుతాయి. అవసరమయితే ఉభయసభల సమావేశాలను ఒక రోజు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవ్వాళ్ళ ఉదయం 8.45 గంటలకు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బిఎసి) సమావేశం కానుంది. ఈ సమావేశాలలో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేస్తారు. సమావేశాల అజెండా ఖరారు అయిన తరువాత ఉభయ సభల సమావేశాలు మొదలవుతాయి.
ఇసుక మాఫియా, కల్తీ మద్యం, కాల్ మనీ, సెక్స్ రాకెట్ ఇలాగ ఒకదాని తరువాత మరొకటి రాష్ట్రంలో బయట పడుతున్న అక్రమ వ్యవహారాల కారణంగా ఈసారి సమావేశాలలో తెదేపా ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమావేశాలలో ఈ వ్యవహరాలన్నిటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా నిన్ననే ప్రకటించింది. అలాగే బాక్సైట్ తవ్వకాలను అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల విషయంపై కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించింది. వైకాపా విమర్శలను తిప్పి కొట్టేందుకు తెదేపా వద్ద బలమయిన ఏమీ కనబడటం లేదు. కాల్ మనీ వ్యవహారంలో కొందరు వైకాపా నేతల పేర్లు కూడా వినబడ్డాయి. కనుక ఆ ఒక్క ఆధారంతోనే వైకాపాను డ్డీ కొనవలసి ఉంటుంది.