ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఇక అంతకు మించి ఆలస్యం చేయడానికి కూడా లేదు. అలా చేస్తే రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఒక సారి అసెంబ్లీ తప్పనిసరిగా సమావేశం కావాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం ఇంత వరకూ వర్షా కాల సమావేశాలను నిర్వహించలేదు. ప్రతీ సారి అసెంబ్లీ సమావేశాలను తప్పనిసరి అన్నట్లుగానే నిర్వహిస్తోంది. గత మార్చిలో బడ్జెట్ పెట్టాల్సి ఉన్నప్పటికీ వాయిదా వేసుకున్నారు.
చివరికి మే 20వ తేదీన ఒక్కటంటే ఒక్క రోజు మాత్రమే సభను నిర్వహించి బడ్జెట్ పెట్టుకుని ఆమోదించుకుని వాయిదా వేశారు. ఆ ఒక్క రోజు సమావేశానికి టీడీపీ హాజరు కాలేదు. నవంబర్ 20వ తేదీకి ఆరు నెలలుపూర్తయిపోతుంది. అంటే ఖచ్చితంగా 20వ తేదీ కంటే ముందే అసెంబ్లీని సమావేశపర్చాలి. అందుకే కాస్త సేఫ్ గా ఉంటుందని ఒక రోజు ముందుగా 18వ తేదీ నుంచి అసెంబ్లీని పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. నాలుగైదు రోజులు నిర్వహించి వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారు.
ఈ మేరకు పదిహేడో తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరగడం.. చర్చల్లో ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యంలో కీలకం. అయితే రాను రాను అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి అధికార పార్టీకి ఆసక్తి తగ్గిపోతోంది. ఒక వేళ నిర్వహించినా ప్రతిపక్షాన్ని కనిపించకుండా.. వినిపించకుండా చేస్తున్నారు.