ఎన్నికలలో ఓటర్లని ప్రలోభపెట్టడానికి రాజకీయ పార్టీలు, నేతలు ఏమేమీ చేయకూడదో అవన్నీ చేస్తుంటారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి శాసనసభ, లోక్ సభ, రాజ్యసభ ఎన్నికల వరకు అన్నిటా ఇదే తంతు. దేనికీ మినహాయింపు లేదు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే కానీ ఆ సంగతిని ఎవరూ పైకి చెప్పుకోరు. ఒప్పుకోరు. కానీ అప్పుడప్పుడు మన రాజకీయ నాయకులే నోరు జారుతుంటారు. అప్పుడే మొదటిసారి ఆవిధంగా జరిగినట్లుగా అందరూ దాని గురించి కొన్ని రోజులు మాట్లాడుకొంటారు. ఆ తరువాత దాని గురించి మరిచిపోతారు. తరువాత మళ్ళీ అంతా షరా మామూలే.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఈసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డా. కోడెల శివప్రసాద రావు నోరు జారారు. ఆయన ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాన్రాను ఎన్నికల ఖర్చు పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 1983 ఎన్నికలలో తనకి కేవలం రూ.30,000 ఖర్చు కాగా, 2014 ఎన్నికలలో 11.50 కోట్లు ఖర్చయిందని చెప్పారు. ఎన్నికల నియామావళి ప్రకారం ఒక అభ్యర్ధి రూ.28 లక్షలకి మించి ఖర్చు పెట్టడానికి వీలులేదు. కానీ కోడెల ఆవిధంగా ఖర్చుపెట్టడం, ఆ సంగతి మీడియాకి చెప్పడం రెండూ తప్పే. పైగా ప్రజలదే తప్పు అన్నట్లుగా ఆయన మాట్లాడటం ఇంకా తప్పు. ఎన్నికల ఖర్చు కోసం కొందరు అభ్యర్ధులు తమ ఆస్తులను కూడా తెగనమ్ముకోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యయం మరీ ఇంతగా పెరిగిపోవడం ఎవరికీ మంచిది కాదని అన్నారు. ప్రజలు కూడా దీని గురించి ఆలోచించి ప్రలోభాలకి లొంగకుండా ఓట్లు వేయాలని కోరారు.
రాజకీయ పార్టీలు, వాటి నేతలు ఎలాగయినా గెలవాలనే తాపత్రయంతోనే ఎన్నికలలో ఎంత డబ్బు ఖర్చు పెట్టాడానికైనా వెనుకాడరు. వారి మద్య పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది కనుకనే వాళ్ళలో వాళ్ళే పోటీలుపడి ఎన్నికల ఖర్చుని పెంచేసుకొంటారు. పోటీలుపడి ఓటర్లని ప్రలోభపెడుతుంటారు. కానీ ఏనాడు ఓటర్లు తమ ఓటుకి ఇంత రేటు అని ప్రకటించుకొన్న దాఖలాలు లేవు. కనుక ప్రజలని తప్పు పట్టడం అనవసరం. ఈ సమస్య రాజకీయ పార్టీలు, వాటి నేతలు స్వయంగా సృష్టించుకొన్నదే తప్ప ప్రజలు సృష్టించినది కాదు. కనుక ఈ ఊబిలో నుంచి ఏవిధంగా బయటపడాలో వాళ్ళే ఆలోచించుకోవాలి తప్ప ప్రజలు కాదు.