రాష్ట్ర విభజన సందర్భంగా విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిచ్చిన హామీలన్నిటినీ అమలు చేయమని రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు, ప్రజలు అందరూ చాలా కాలంగా కేంద్రాన్ని కోరుతున్నారు. తెదేపా,భాజపాలు మిత్రపక్షాలుగా, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉంటున్నపటికీ తెదేపా వాటి గురించి కేంద్రాన్ని గట్టిగా అడగడం లేదని రాష్ట్రంలో ప్రతిపక్షాలు చాలా కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిందిస్తున్నాయి. భాజపాతో తన సంబంధాలను కాపాడుకోవడానికి ఆయన రాష్ట్ర ప్రయోజనాలను మోడీ ప్రభుత్వానికి తాకట్టు పెడుతున్నారని నిత్యం విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం చాలా అవసరమనే కారణంతో ఇంత కాలం చంద్రబాబు నాయుడు హామీల అమలు కోసం కేంద్రంతో ఘర్షణకి సిద్దపడలేదు. కానీ నిన్న పార్లమెంటు ఉభయసభలలో వాటి గురించే చర్చ జరగడంతో, కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఇదే మంచి అదునని చంద్రబాబు నాయుడు భావించి, ఆ హామీల గురించి బుధవారం శాసనసభలో ప్రత్యేకంగా చర్చ చేపట్టి, వాటిని తక్షణమే అమలుచేయాలని కోరుతూ ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించాలని నిర్ణయించారు.
దీని కోసం నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెదేపా శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. దానిలో ఇంత వరకు కేంద్రం అమలుచేసిన హామీల గురించి చర్చించి, ఇంకా అమలు చేయవలసి ఉన్న ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి వాటి కోసం శాసనసభలో ప్రత్యేకంగా చర్చ చేపట్టి తీర్మానం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ విషయం గురించి కేంద్రప్రభుత్వానికి ముందే తెలియజేయాలని నిర్ణయించారు. శాసనసభలో తీర్మానం చేసి పంపుతున్నపటికీ, కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభించకుండా, స్నేహపూర్వకంగా ఉంటూనే రాష్ట్రానికి రావలసినవన్నీ రాబట్టుకొందామని చంద్రబాబు నాయుడు చెప్పారు. కనుక ఈ తీర్మానం కేవలం కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి మాత్రమేనని స్పష్టం చేసారు.
కారణాలు ఏవయితేనేమి, ఎట్టకేలకు తెదేపా ప్రభుత్వం తనంతట తానుగా హామీల అమలు గురించి మళ్ళీ శాసనసభలో చర్చించడానికి సిద్దపడింది. ఇంతకాలంగా తాము ఎంతగా చెపుతున్నా పట్టించుకోలేదని ఆరోపిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మళ్ళీ నిందించకమానరు. అలాగే మళ్ళీ ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామాలకు మళ్ళీ డిమాండ్ చేయకామానరు. తెదేపా ప్రభుత్వం ఒకపక్క సభలో వైకాపాని ఎదుర్కొంటూనే మరో పక్క మిత్రపక్షంగా ఉన్న భాజపాని కూడా ఎదుర్కోవలసి రావచ్చును. కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయాలని చూస్తే, సభలో భాజపా సభ్యులు తీవ్ర అభ్యతరం తెలపవచ్చును కనుక వారిని నొప్పించకుండా సభలో చర్చను కొనసాగించవలసి ఉంటుంది.
ఈ 22 నెలలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఏమేమి చేసిందో సభాముఖంగా ప్రజలకు వివరించి చెప్పేందుకు భాజపాకి కూడా ఇది చాలా మంచి అవకాశం కనుక దానిని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేయవచ్చును. కేంద్ర పధకాలను తమ స్వంతవిగా తెదేపా ప్రభుత్వం ప్రచారం చేసుకొంటోందని ఆరోపిస్తున్న భాజపా నేతలు, ఈరోజు చర్చలో ఆ విషయం గురించి కూడా తెదేపా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చును. దానిపై ఇరు పార్టీల సభ్యుల మధ్య సభలో వాగ్వాదాలు జరిగినా ఆశ్చర్యం లేదు. కానీ ఈ తీర్మానాన్ని భాజపా సభ్యులు వ్యతిరేకిస్తే అది ప్రజలకు వారి పార్టీ వైఖరి గురించి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది కనుక వారు కూడా దానిని ఆమోదించవలసి ఉంటుంది.