వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్, ఆమె మీద సభా హక్కుల కమిటీ ఎదుట సాగుతున్న విచారణ వ్యవహారాలు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. ఒకవైపు తన సస్పెన్షన్ కు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రోజా సుప్రీంను ఆశ్రయించి.. అక్కడి విచారణకోసం నిరీక్షిసున్తన్నారు. సోమవారం ఈ కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం (6వ తేదీన) తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీ శాసనసభ హక్కుల కమిటీ రోజాకు నోటీసులు పంపడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
ప్రధానంగా గమనించాల్సింది ఒకటుంది. విచారణ కమిటీ పిలిచినప్పుడు హాజరై వివరణలు ఇచ్చిన ఎమ్మెల్యేలంతా ఎంచక్కా సభలో ఉన్నారు. గైర్హాజరైన రోజా మీద మాత్రమే వేటు పడింది. ఆ తర్వాతి పరిణామాల్లో హైకోర్టు తీర్పులు కూడా వచ్చిన తర్వాత.. రోజా.. విచారణ కమిటీ తనను ఎప్పుడు పిలిచినా హాజరు అవుతానని తేల్చిచెప్పారు.
అయితే క్షమాపణ చెప్పడానికి మాత్రం రోజా సుముఖంగా లేరని గుర్తించాల్సి ఉంది. మిగిలిన వైకాపా ఎమ్మెల్యేలు నలుగురూ క్షమాపణ చెప్పే తిరిగి సభలోకి వచ్చారు. కానీ రోజా ససేమిరా అంటున్నారు. ఆ నేపథ్యంలో ఆమె 6వ తేదీన హక్కుల కమిటీ ఎదుట విచారణకు హాజరైతే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
తాను అసెంబ్లీలో ఏమీ తప్పుగా మాట్లాడలేదు.. సారీ చెప్పనవసరం లేదు అని కమిటీ ఎదుట రోజా మౌఖికంగా చెబితే కుదరకపోవచ్చు. నిజానికి జ్యోతుల నెహ్రూ కూడా ఇలాగే చెప్పారు. అయితే ఆయన అన్నమాటలు ట్రాన్స్‌స్క్రిప్షన్ కాపీ ప్రింటవుట్‌ను ఆయన చేతికి ఇచ్చి.. వాటి వీడియో రికార్డులు ఉన్నాయని కమిటీ వారు చెప్పడంతో ఆయన తెల్లబోయి.. సారీ చెప్పి బయటపడ్డారు. ఇప్పుడు రోజా.. తానేమీ తప్పుగా అనలేదని వాదిస్తే గనుక.. హక్కుల కమిటీ.. రికార్డుల్లోని వీడియాలను తీసిచూపించే అవకాశం ఉన్నదని అంచనాలు సాగుతున్నాయి. అదే జరిగితే రోజా ఇరుకున పడుతుందనేది పార్టీ వర్గాల వాదన. రోజా – ‘ ఈ వివాదాన్ని పొడిగించడం ఇష్టం లేదు’ అని జనాంతికంగా ఒక డైలాగు వేసి.. సారీ చెప్పేస్తే.. మేలు అని… సాగదీస్తే మాత్రం వీడియోలు బయటకు వస్తే.. కోరి కొరివితో తలగోక్కున్నట్లు అవుతుందని పార్టీ వారే పేర్కొంటున్నారు.