ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వెనుక.. చంద్రబాబుపై కోపం తప్ప.. ఇంకేమీ లేదని… ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తేల్చారు. చరిత్రలో తెలుగు జాతి సామూహిక ఆత్మహత్యకు … జగన్మోహన్ రెడ్డి కారణంగా నిలువబోతున్నారని.. ఆయన విశ్లేషించారు. అమరావతి విషయంలోనే ఆర్కే ఈ ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని అసెంబ్లీలోనే స్వాగతించిన జగన్.. ఇప్పుడు మార్చేస్తున్నారు. అమరావతిపై అన్ని రకాల ముద్రలు వేసి.. సర్కార్… వాటిని నిరూపించలేకపోతోందని చెబుతున్నారు. ఆధారాలు లేకపోయినా.. అధికారం చేతిలో ఉండి నిరూపించలేకపోయినా.. ప్రజల్లో వేసిన ముద్ర కారణంగా.. అమరావతి రైతులకు సీమ నుండి మద్దతు లభించడం లేదు. జగన్ నిర్ణయం వల్ల.. ప్రభుత్వం మారితే.. రాజధాని .. సీమకు మారదని గ్యారంటీ ఏమిటన్న ఓ సందేహాన్ని కూడా ఆర్కే తీసుకొచ్చారు. దీని వల్ల నిర్వీర్యమయ్యేది ఏపీనే కానీ.. ఓ కులం కాదని.. ఆయన విశ్లేషించారు.
తెలివిగలవాళ్లు అని స్వయం సర్టిఫికెట్లు పొందిన ఏపీ ప్రజలు.. ఇప్పుడు.. అత్యంత పనికిమాలిన వాళ్లుగా మారిపోయారని.. ఆర్కే.. పరోక్షంగా.. పలు ఘటనలు ఉదహరించి చెప్పేశారు. అందులో ప్రధానంగా తెలంగాణతో పోల్చారు. రాష్ట్ర విభజన జరిగితే.. తెలంగాణ కష్టాల్లో పడుతుందని ఏపీ పాలకులు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ శుభ్రంగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఆగమైపోయింది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీలో.. వెనుకబడిన జిల్లాలని చెప్పి.. వాటికి ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని ఆర్కే చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్టణం మాత్రమే అభివృద్ధి చెందిందనీ, రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పట్టణీకరణ అసలు జరగలేదనీ పేర్కొన్న జీఎన్ రావు కమిటీ తన సిఫారసులలో ఈ జిల్లాలకు చేసిన న్యాయం ఏమీలేదు.
ఒక పరిశ్రమనో, సంస్థనో ఏర్పాటుచేస్తే స్థానికులకు వందలు, వేలసంఖ్యలో ఉపాధి లభిస్తుంది. హైకోర్టు వల్ల కర్నూలు ప్రజలు సాధించుకున్నది ఏమిటి? రాయలసీమకు జరిగిన న్యాయం ఎక్కడ? .. అని ఆర్కే ప్రశ్నిచారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల ప్రజలలో జగన్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం.. ఆర్కే వ్యక్తం చేశారు. మొత్తానికి ఆర్కే అభిప్రాయాల్లో రాజకీయాల పరంగా పాక్షికత కనిపిస్తుందేమో కానీ.. కొన్ని అంశాల్లో …ఆలోచించతగ్గట్లుగానే ఉంటాయి.