కాంగ్రెస్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోస్తీ, భాజపాతో ఆయన వైరం… ఈ రెండింటి చుట్టూనే వైకాపా చక్కర్లు కొడుతోంది. రాష్ట్రం, సమస్యలు, ప్రయోజనాలు అవేవీ అక్కర్లే. టీడీపీ అనుసరిస్తున్న వైఖరిని అవకాశవాద రాజకీయంగా చిత్రించే ప్రయత్నం చాలా బలంగా చేస్తోంది. దానికి తగ్గట్టుగానే ఇవాళ్లి సాక్షి పత్రికలో ‘గోబెల్స్ సిగ్గుపడేలా’ అంటూ ఒక కథనం రాశారు. కాంగ్రెస్, భాజపాలను ఉద్దేశించి రోజుకో రకంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు అనేదే ఈ కథనం సారాంశం. గతంలో, చంద్రబాబు కాంగ్రెస్ ను విమర్శించిన వ్యాఖ్యలు కొన్ని, భాజపాను మెచ్చుకుంటూ కొన్ని, కాంగ్రెస్ మెచ్చుకుంటూ భాజపాని విమర్శిస్తూ కొన్ని… ఇలాంటివి ఏరుకొచ్చి కథనంలో చేర్చారు. భాజపాతో ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ని విమర్శించారనీ, ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసేందుకు భాజపాపై విమర్శలు చేస్తున్నారంటూ రాశారు. ఇంకోటి… గడచిన పదేళ్లుగా వైకాపాది ఒంటరిపోరాటమే అంటూ గొప్పగా చెప్పారు.
భాజపాతో తెలుగుదేశం ఎందుకు పొత్తుపెట్టుకుంది..? రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా! కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో టీడీపీ ఎందుకు వైరం పెంచుకుంది..? రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా. ఆంధ్రాకి కేంద్ర సాయం అవసరం. అది భాజపా నుంచి దక్కే పరిస్థితి లేదు. కాబట్టి, ప్రత్యామ్నాయంగా కేంద్రంలో ఆంధ్రాకి న్యాయం చేయగలిగేది ఎవరూ… అక్కడ ఉన్నది కాంగ్రెస్సే. ఆ పార్టీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనీ, విభజన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని చెప్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది… టీడీపీ కూడా అదే చేసింది.
అప్పుడూ ఇప్పుడూ వైకాపాకి ఒకే మాట అంటూ గొప్పగా రాశారు! ఇంతకీ వైకాపాకి ఉన్న అనుభవం ఏపాటిది..? రాష్ట్ర ప్రయోజనాల గురించి పాటుపడ్డ చరిత్ర ఎక్కడుంది..? ధైర్యంగా మోడీపై విమర్శలు చేసిన సమర్థతను ఎన్నడైనా కనబరిచిందా..? గోడ మీద పిల్లి వాటంగా ఉంటోంది కాబట్టే విమర్శలు చేయడానికి భయం. మోడీని పొడిగినవారే ఇప్పుడు విమర్శించేస్తున్నారంటూ సాక్షి అక్కసు వెళ్లగక్కుతోందిగానీ… ఈ క్రమంలో ఆంధ్రాకి భాజపా చేసిన అన్యాయాన్ని ఈ కథనంలో ఎందుకు ప్రస్థావించలేకపోతున్నారు..?
హోదా ఇస్తామంటూ ప్రధాని తిరుపతి సభలో మాటిచ్చింది నిజం కాదా? ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామంటూ మోడీ చెప్పలేదా..? అవేవీ చెయ్యని కేంద్రాన్ని ఈ పత్రిక ఎందుకు ప్రశ్నించదు..? ఆంధ్రా విషయంలో కేంద్రం వైఖరి మారింది కాబట్టే… ప్రజాప్రయోజనాల దృష్ట్యా టీడీపీ వైఖరి మార్చుకోవాల్సి వచ్చింది. అంతేగానీ.. రాజకీయాలు చేస్తూ కూర్చోవాలంటే… హాయిగా వైకాపాలా కామ్ గా కూర్చోవచ్చు. దాన్నే గొప్ప రాజకీయ వైఖరి ఇలా ఎన్నైనా రాసుకోవచ్చు. ఎంతసేపూ టీడీపీ వైఖరి మారిపోయిందీ, చంద్రబాబు మాట మార్చేశారూ, అప్పుడు తిట్టారూ ఇప్పుడు పొగిడారూ… ఇంతవరకే సాక్షి పరిమితమౌతోంది. అంతేగానీ, ఏ పరిస్థితుల మధ్య ఇలా వైఖరి మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందనిగానీ, ఈ పరిస్థితికి కారణం కేంద్రం అనుసరిస్తున్న కక్ష సాధింపు ధోరణి అనిగానీ సాక్షి రాయలేదు. అంతమాత్రాన ప్రజలకు వాస్తవం తెలియకుండా ఉండదు. ఒక పత్రికగా ప్రజల ప్రయోజనాలకు ప్రతిబింబించలేని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడాల్సింది ఎవరు..?