ఏపీ ప్రభుత్వం మద్యం వ్యాట్ తగ్గించింది. అప్పుడు మందు బాబులు సంబరాలు చేసుకున్నారు. రేటు తగ్గించారని అనుకున్నారు. కానీ అదంతా ఉత్తుత్తిదే. వ్యాట్ తగ్గించి.. స్పెషల్ మార్జిన్ పేరుతో.. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మిగతా మొత్తాన్ని వసూలు చేసుకుంటోంది. ఇలా వసూలు చేసుకోవచ్చని ప్రత్యేకంగా ఆర్డినెన్స్ కూడా ఇచ్చారు. షరా మామూలుగానే ఇది రహస్యంగా ఉంది. ఇటీవల ఏపీ బేవరెజెస్ కార్పొరేషన్‌ను కంపెనీల చట్టం కిందకు మార్చారు. ఇదంతా అప్పుల కోసం తిప్పలన్నమాట. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోవడం లక్ష్యం. ఇప్పటికే తెచ్చుకున్నారు. ఇంకా తెచ్చుకోవడానికన్నమాట.
అప్పుల కోసం ప్రభుత్వం ఎన్ని లెక్కలు వేయాలో.. ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తోంది. మొదట్లో పన్నులఆదాయాన్ని ఖాజానాకు రాకుండా నేరుగా మళ్లించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్న వాదన రావడంతో.. చివరికి కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేయడంతో రూటు మార్చారు. బేవరెజెస్ కార్పొరేషన్‌ను కంపెనీగా మార్చి.. స్పెషల్ మార్జిన్ వసూలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. నిజానికి ఇంకా భయంకరమైన రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్న నిపుణులు చెబుతున్నారు.
ప్రజల నుంచి పన్నుల వసూలు .. ప్రభుత్వాలదే. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు మాత్రమే పన్నులు వసూలు చేయగలవు. కానీ.. ప్రభుత్వ కార్పొరేషన్లు కానీ.. కంపెనీలు కానీ చేయలేవు. అయితే ఇప్పుడు స్పెషల్ మార్జిన్ పేరుతో ఈ పన్నులను వసూలు చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చేస్తోంది. ఇది ప్రభుత్వానికి మరో తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. అప్పుల కోసం ఇప్పటికే మద్యంపై వచ్చే ఆదాయాన్ని పాతికేళ్లకు తాకట్టు పెట్టిన సర్కార్.. దాన్ని ఎలా పెంచుకోవాలో ఆని .. లెక్కల్లో సర్కస్ జిమ్మిక్కులు చేస్తోంది. ఈ విన్యాసాలు సామాన్య ప్రజలకు అర్థం కావు కానీ.. ప్రభుత్వ పెద్దల ట్రాక్ రికార్డు చూసిన వారికి మాత్రం.. బాబోయ్ … మామూలు లెక్కల మాస్టార్లు కాదని నోరెళ్లబెట్టడం మినహా మరేం చేయలేరు.