ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారని బీజేపీపై వైసీపీ విమర్శలు చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అలజడికి కారణం అవుతోంది. బీజేపీ వైపు నుంచి ఎలాంటి కవ్వింపులు లేకపోయినా వైసీపీ .. బీజేపీపై ఎందుకు ఎదురు దాడి చేస్తుందో ఆ పార్టీ నేతలు ఆలోచించి.. ఆలోచించి చివరికి ఓ క్లారిటీ తెచ్చుకున్నారు. అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కఠినంగా వ్యవహరిస్తోంది. అప్పులు తీసుకోకుండా కేంద్రం కట్టడి చేస్తూండటంతో ప్రభుత్వం నడపడం సాధ్యం కాదు కాబట్టి… బీజేపీపై ఒత్తిడి పెంచడానికి ఈ విమర్శలు చేశారన్న అభిప్రాయానికి వారు వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ దియోధర్ పేర్ని నానికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. తమకు జగన్ సర్కార్ను కూల్చే ఉద్దేశం కానీ వేలకోట్ల అవినీతి చేసి మీ ప్రభుత్వానికి మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారని ఎద్దేవా చేశారు.అలాగే కేంద్రం కూడా అప్పులు చేస్తోందన్న పేర్ని నాని చేసిన విమర్శలపైనా సునీల్ ధియోధర్ స్పందించారు. బీజేపీ దేశ ప్రతిష్టను పెంచుతూంటే వైసీపీ రాష్ట్రాన్ని ముంచుతోందని మండిపడ్డారు ఇతర బీజేపీ నేతలు కూడా స్పందించారు. జీవీఎల్ నరసింహారావు ఎప్పట్లానే ఈవిషయంలోనూ టీడీపీ ప్రస్తావన తీసుకు వచ్చారు. టీడీపీ లాగానే రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే జీవీఎల్ ఖచ్చితంగా టీడీపీనే ముందుగా విమర్శించి.. ఆ తర్వాత మెత్తగా వైసీపీని విమర్శిస్తారు. ఈసారి కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యారు.
రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం.. పేర్ని నానిపై చాలా సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు. ఆయన ఏ ఉద్దేశంలో అలా మాట్లాడారోనన్నట్లుగా ప్రకటనలు చేశారు. మేమేం ప్రజాసేవ చేస్తోంటే మీకేం నొప్పి అని సోము వీర్రాజు ..పేర్నినానిని ప్రశ్నించారు. ఇతర నేతలు వీలైనంతగా నోరు తెరవకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్రంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నిహితంగానే ఉంటోంది. రాష్ట్రంలోనూ బీజేపీ నేతలు ప్రభుత్వంపై దూకుడుగా వెళ్తున్న సందర్భాలు కూడా తక్కువే. అయితే అనూహ్యంగా పేర్ని నాని బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా కలకలం ప్రారంభమైంది.