విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానికి అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ అనే గోదావరి జిల్లాల నాయకుడ్ని బీజేపీ హైకమాండ్ ప్రకటించిది. ఆయన అసలు రేసులో ఉన్నారని కూడా ఎవరూ అనుకోలేదు. కానీ ఆయన పేరు అధికారికంగా ప్రకటించేశారు. ప్రస్తుతం క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన ఆయన కు పదవి ఇప్పించాలని పురందేశ్వరి సిఫారసు చేశారు. ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరు పరిశీలనలోకి వచ్చింది కానీ సోము వీర్రాజుకు ఖరారు అయింది. ఇప్పుడు ఆయనకు రాజ్యసభ దక్కింది.
వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. బీజేపీ ప్రోద్భలంతోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేసినందున ఆ సీటు బీజేపీకే కేటాయిస్తారని అనుకున్నారు. అందుకే మొదటి నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు అన్నామలై, స్మృతి ఇరానీ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం స్థానిక నేతకే అవకాశం కల్పించింది.
పదవులన్నీ ఒకే ప్రాంతానికి బీజేపీ కేటాయించడంతో ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్రమంత్రి కూడా గోదావరి జిల్లాలకు చెందిన వారే. కూటమిలో భాగంగా వచ్చిన ఎమ్మెల్సీ, రాజ్యసభ కూడా అదే ప్రాంతానికి ఇచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కూడా సాంకేతికంగా అదే ప్రాంతానికి చెందినట్లు.రాయలసీమ నేతల్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఆ ప్రాంతానికి ఇచ్చే అవకాశం ఉంది.