ప్రధాని మోదీ పర్యటన గురించి తమకు సమాచారం లేదని.. ఏపీ బీజేపీ నేతలు అసంతృప్తికి గురయ్యారు. బహిరంగసభ మొత్తం వైసీపీ కనుసన్నల్లో విజయసాయిరెడ్డి నేతృత్వంలో జరుగుతున్నా ఎవరూ ఆపకపోవడంతో వారు మరింత ఖిన్నులయ్యారు. అంతా సోము వీర్రాజే చేస్తున్నారని.. వైసీపీ కోవర్టుగా ఉన్నారని ఓ వర్గంలో అసంతృప్తి మొదలయింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో…ఓ తార్కిక ముగింపును హైకమాండ్ ఇచ్చింది. ప్రధాని మోదీ రోడ్ షో కోసం ఏపీ బీజేపీకి చాన్సిచ్చారు. బహిరంగసభను వైసీపీకి సర్దుబాటు చేశారు. నిన్నటిదాకా ప్రధాని మోదీ పర్యటనలో లేని రోడ్ షో ను ఇవాళ యాడ్ చేశారు.
నవంబర్ 11 సాయంత్రం 6 గంటలకు INS డేగా వద్ద గల మారుతీ జంక్షన్ నుండి నావెల్ డాక్ యార్డ్ రోడ్ మీదగా శోభా యాత్ర జరిపేలా షెడ్యూల్ మార్చారు. దీంతో ఏపీ బీజేపీ నేతలు సంతోషపడ్డారు. ప్రధాని మోదీ వస్తున్నా.. తమకు ఎలాంటి సమాచారం ఉండటం లేదని.. అంతా వైసీపీ నేతలే హైజాక్ చేస్తున్నారని.. నిన్నటి వరకూ బాధపడ్డారు. జీవీఎల్ కూడా విశాఖలోనే మకాం వేసి.. ఆ ప్రోగాం ప్రధానిదని.. అంటే బీజేపీదన్నట్లుగా చెప్పుకునే ప్రయత్నం చేశారు.కానీ యాక్టివ్‌గా ఎలాంటి అవకాశాన్నీ .. నేరుగా పాలు పంచుకునే చాన్స్‌ను విజయసాయిరెడ్డి బీజేపీ నేతలకు ఇవ్వలేదు.
చివరికి హైకమాండ్ వద్ద మొర పెట్టుకుని ఏపీ బీజేపీ నేతలు ఎలాగోలా రోడ్ షోకు పర్మిషన్ తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ రోడ్ షోకు జనాలను సమీకరించాల్సిన బాధ్యత బీజేపీ నేతలపై పడింది. జనం కనిపించకపోతే.. బీజేపీ నేతల పరువు పోతుంది. బహిరంగసభ బాధ్యత వైసీపీ తీసుకుంది కాబట్టి.. ఎలాగోలా.. అందర్నీ సమీకరించి తీసుకొస్తుంది. కానీ రోడ్ షోకు మాత్రం బీజేపీ టెన్షన్ పడాల్సిందే. పట్టుబట్టి మరీ రోఢ్ షోకు అనుమతి తెచ్చుకున్న ఏపీ బీజేపీ.. దాన్ని విజయవంతం చేయాల్సి ఉంది. మొత్తంగా ఈ పరిణామాలను చూస్తే.. ఏపీ బీజేపీ, వైసీపీ మధ్య అలా రాజీ కుదిరిందని సెటైర్లు పడుతున్నాయి.