ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. గత ఎనిమిదేళ్లుగా ఆయన యాక్టివ్ గా లేరు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. కాంగ్రెస్ తరపున సీఎంగా ఉండి కూడా రాష్ట్ర విభజన ఆపలేకపోయారు. అంతేనా సొంత పార్టీ కూడా పెట్టుకున్నారు. కానీ ఏ మాత్రం ప్రయోజనం లేకపోయింది. తర్వాత పార్టీని గాలికొదిలేశారు. కొన్నాళ్లు సైలెంట్ గా ఉండి గత ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆయన ఎక్కడా ఎలాంటి బాధ్యతలు తీసుకోలేదు.
మళ్లీ ఇప్పుడు ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. జబ్బును కనిపెట్టి దానికి మందు వేయాలనే ఆలోచన కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదన్నారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం కూడా చేయలేకపోయిందని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో బలహీనపడుతూ నాశనమయ్యే స్థితికి వచ్చిందని కామెంట్ చేశారు. అధినాయకత్వం చెప్పిందే వేదం అంటారే కానీ… కింది స్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకునే వాళ్లు ఒక్కరూ లేరని ఎద్దేవా చేశారు. నేతల, పార్టీ శ్రేణుల అభిప్రాయంతో పని లేకుండా నిర్ణయాలు తీసుకుంటారని అందుకే కాంగ్రెస్ క్షీణదశకు చేరిందని విమర్శించారు.
ఎంతో గొప్ప పొలిటికల్ హిస్టరీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన కిరణ్ కుమార్‌రెడ్డి బీజేపీలో చేరడం చాలా ఆనందించదగ్గ విషయమన్నారు కండువా కప్పిన కేంద్ర మంత్రిప్రహ్లాద్ జోషి. ఆయన మళ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించారని… ఇకపై ఏపీలో బ్యాటింగ్ జోరందుకుంటుందని ప్రశంసించారు. సోము వీర్రాజు ఈ చేరిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లలేదు. కానీ … కిరణ్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. కలిసి పోరాటం చేసి బీజేపీని అధికారంలోకి తెద్దామని సూచించారు.
మరో వైపు కిరణ్ కుమార్ రెడ్డికి చేరికలోనే బీజేపీ అవమానించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. .ఓ మాజీ ముఖ్యమంత్రి పార్టీలో చేరికకు వస్తే కనీసం బీజేపీ పార్టీ అధ్యక్షుడు కూడా కండువా కప్పడానికి రాలేదు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కండువా కప్పించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏపీ బీజేపీలో ఆయనకు ఏ పాత్ర ఇస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదు.