ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు తీరుపై ఈ మధ్య చాలా అనుమానాలు కలుగుతున్నాయి. వారి వైఖరిని పార్టీ వైఖరిగా చూడాలా… లేదా, నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలుగా పరిగణించాలనే సందిగ్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నా సరే… చంద్రబాబు సర్కారుపై విమర్శలు చేస్తుంటారు. మిత్రధర్మం పాటించి ప్రతివిమర్శలు చేయలేకపోతున్నామని సీఎం చంద్రబాబు అంటే… తామూ ఇకపై ఆ ధర్మాన్నే పాటిస్తామని ఏపీ భాజపా నేతలు అంటారు. పోనీ… టీడీపీ విషయంలో ఏదో ఒక స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తూ ఏపీ నేతలంతా ఒకే మాటకు కట్టుబడి ఉన్నారా అంటే, అది కూడా కష్టమే.
మంత్రి మాణిక్యాలరావుది ఒక తీరు అయితే, కామినేని శ్రీనివాస్ వ్యవహార శైలి ఇంకోరకం. సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు, పురందేశ్వరి, కన్నా… ఇలా వీరంతా తలోరకంగా స్పందిస్తుంటారు..! అయితే, ఏపీ భాజపాలో ఇంత జరుగుతున్నా అమిత్ షాకి వినిపించడం లేదా..? ఏపీ నేతల వైఖరిని అధినాయకత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు..? దీని వెనక అమిత్ షాకి ఏదైనా వ్యూహం ఉందా..? ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఈ మధ్య వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ఏంటంటే… ఏపీలో పార్టీ గురించి భాజపా అధినాయకత్వమే పెద్దగా శ్రద్ధ చూపించడం లేదనే గుసగుసలు ఇప్పుడు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయట!
వచ్చే ఎన్నికల నాటికి ఏ రాష్ట్రంలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై అధ్యక్షుడు అమిత్ షా దగ్గర చాలా వ్యూహాలు ఉన్నాయంటారు! రాష్ట్రాలవారీగా పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా పక్కా ప్రణాళిక ఆయన దగ్గర ఉందంటారు. అయితే, ఈ క్రమంలో ఆంధ్రాకు సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశం ప్రస్తుతానికి అమిత్ షాకు లేదని ఓ భాజపా నేత ఆఫ్ ద రికార్డ్ చెప్పినట్టు తెలుస్తోంది. అమిత్ షా దగ్గరున్న జాబితాలో ఆంధ్రాలో పార్టీ విస్తరణ అనేది అత్యవసర లక్ష్యంగా లేదని సమాచారం! వచ్చే ఎన్నికల్లో ఎలాగూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రాలో ఉంది కాబట్టి, ఇప్పటికిప్పుడు అక్కడి అంశాలపై శ్రద్ధ పెట్టడం వలన ఒరిగేది ఏమీ ఉండదనేది ఆయన విశ్లేషణగా చెబుతున్నారు!
నిజానికి, అందుకు తగ్గట్టుగానే ఆంధ్రాలో పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆంధ్రా భాజపా అధ్యక్షుడిని మార్చుతారని కొన్నాళ్లుగా చెబుతూ వచ్చారు. కానీ, దానికి సంబంధించి ఎలాంటి కదిలికా లేదు. పోనీ, ఆంధ్రాలో భాజపా నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చి… పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునే స్వేచ్ఛ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు ఇస్తున్నారా అంటే, అదీ లేదు. మిత్రపక్షమైన టీడీపీ మీద పార్టీ నేతలు తలోరకంగా విమర్శిస్తున్నా అధ్యక్షుడుగా హరిబాబు స్పందించకపోవడమే అందుకు సాక్ష్యం. ఇక, ఆంధ్రాలో భాజపాకి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కూడా లేకపోవడం గమనార్హం! ఉత్తరప్రదేశ్ మంత్రి వర్గంలో సిద్ధార్థ్ నాథ్ సింగ్ కు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఏపీ ఇన్ ఛార్జ్ పోస్టుకి ఖాళీ ఏర్పడింది. కనీసం ఆ పోస్టు భర్తీ చేసి, ఏపీ వ్యవహారాలను ఒక సీనియర్ కు అప్పగించినా పార్టీ పరిస్థితి మరోలా ఉండేదేమో..! కానీ, ఆ పని కూడా భాజపా చేయడం లేదు. కనీసం ఆ దిశగా అమిత్ షా ఆలోచిస్తున్నారనే దాఖలాలు కూడా లేవు. సో… ఏతావాతా అర్థమౌతున్నది ఏంటంటే, ఏపీ నాయకుల్ని ఒక తాటి మీదికి తీసుకుని రావాలీ, సమన్వయం కోసం కృషి చేయాలనే ఉద్దేశం ప్రస్తుతం అధినాయకత్వం ప్రాధమ్యాల్లో లేని అంశంగా తెలుస్తోంది.