విశాఖపట్నం మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబుకు గవర్నర్ పదవి వరించింది. ఆయన పేరు ఎక్కడా ప్రచారంలో లేకపోయినా అనూహ్యంగా ఆయనకు పదవిని ఇస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంకు ఆయన గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు చెందిన మరో నేత బండారు దత్తాత్రేయ కూడా చాలా కాలంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. ఆయనను తాజాగా.. హర్యానాకు మార్చారు. ఇక నుంచి ఆయన హర్యానా గవర్నర్గా వ్యవహరించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్క బీజేపీ నేతకు గవర్నర్ పదవి ఇచ్చినట్లయింది.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడల్లా.. బీజేపీ ముఖ్య నేతలు అన దగ్గ వారికి గవర్నర్ పదవులు కేటాయించడం సంప్రదాయంగా వస్తోంది. గతంలో వీఎస్ రమాదేవి, విద్యాసాగర్ రావు వంటి వారికి కూడా చాన్సులు కల్పించారు. రేపోమాపో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కేంద్రమంత్రివర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే గవర్నర్లను నియమించినట్లుగా తెలుస్తోంది. ఆ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదని.. సంకేతాలు వచ్చాయి. ఏపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కేంద్రమంత్రి లేరు. మరోసారి చాన్సిచ్చే అవకాశం కూడా లేదు. అందుకే.. చాలా కాలం పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేసిన హరిబాబుకు గవర్నర్గా చాన్సిచ్చినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న ధాపర్ చంద్ గెహ్లాత్ను కర్ణాటక గవర్నర్గా నియమించారు. అంటే ఆయనకు ఉద్వాసన పలకడం ఖాయమన్నమాట. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మరికొంత మంది పదవులు కోల్పోయే అవకాశం ఉంది. ఎక్కవ మందిని చేర్చుకోనున్నారు. కంభంపాటి హరిబాబుకు… ఈశాన్య రాష్ట్రంలో చోటు కల్పించినా.. గవర్నర్ పదవికి ఉండే గౌరవం వేరని.. ఆయనకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.