కేంద్ర మంత్రి వర్గాన్ని సంక్రాంతి తర్వాత విస్తరించనున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా బీజేపీ వ్యూహం ప్రకారం ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యాన్నికేబినెట్లో కల్పిస్తారు. ఈ ఏడాది చివరి వరకూ తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ష, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొంత మంది కొత్త ఎంపీలకు మంత్రివర్గంలో అవకాశం లభించవచ్చునని బీజేపీలో చర్చ జరుగుతుంది.
దేశంలో అన్ని రాష్ట్రాలకు ఓ కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం ఉంది కానీ ఏపీకి మాత్రం లేరు. ఈ సారి ఏపీ నుంచి కూడా ఓ కేంద్ర మంత్రి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ అలాంటి చాన్స్ లేదని.. ప్రచారం అంతా ఉత్తదేనని ఢిల్లీ వర్గాలు తేలికగా తీసుకుంటున్నాయి. ఎలాంటి సమీకరణాలు చూసినా కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదంటున్నారు. తెలంగాణకే మరో పదవి ఇచ్చి… తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు మంత్రులు అని చెబుతారని అంటున్నారు.
ప్రస్తుతం ఏపీ నుంచి బీజేపీకి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాత్రమే ఉన్నారు. జీవీఎల్ నరసింహారావు కూడా ఎంపీ అయినప్పటికీ ఆయన యూపీ కోటాలో ఎంపీ అయ్యారు. సీఎం రమేష్ టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. దీంతో ఇద్దరికీ అవకాసం లేదని తెలుస్తోంది. ఓ సహాయ మంత్రి పదవి అయినా ఇవ్వకపోతే ఏపీని ఘోరంగా నిర్లక్ష్యం చేసినట్లవుతుందన్న భావన ఏర్పడుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ అలాంటి స్టామినా ఉన్న నేత లేరని.. కేంద్ర బీజేపీ వర్గాలు లైట్ తీసుకుంటున్నాయి.