ఆంధ్రప్రదేశ్ బీజేపీలో సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం ఖాయమన్న నమ్మకం రోజు రోజుకు బలపడుతోంది. ఈ కారణంగా తదుపరి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు పలువురు భిన్నమైన మార్గాలు అనుసరిస్తున్నారు. సోము వీర్రాజును వ్యతిరేకిస్తున్న నేతలంతా విజయవాడలో సమావేశమయ్యారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి హోదాలో హైకమాండ్ వద్ద పలుకుబడి ఉన్న సత్యకుమార్‌ను అభినందించేందుకు అంటూ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సోము వీర్రాజుకు కనీస సమాచారం ఇవ్వలేదు. ఆయన ప్రస్తావన కూడా సమావేశంలో తీసుక రాలేదు.
ఇది సోము వీర్రాజుకు వ్యతిరేకంగా జరిగినట్లుగా బీజేపీలో ఓ అభిప్రాయం బలపడిపోయింది. జాతీయ కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ అద్వర్యంలో జరిగిన ఈ సభకు కన్నా లక్ష్మి నారాయణ లంకా దినకర్, తురగా నాగభూషణం, జమ్ముల శ్యామ్ కిషోర్, కిలారు దిలిప్ , పాతూరి నాగభూషణం మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.. రమేష్ నాయుడు , SK బాజీ , శ్రీనివాస రాజు వంటి ముఖ్యనేతలు హాజరయ్యారు. వీరందరూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయనాకి తన వంతు కృషిచేసిన సత్యకుమార్ ను ఎపి రాజకీయాలపై దృష్టి పెట్టాలని కోరారు.
ఈ సమావేశంలో అధ్యక్ష పదవి కోసం పోటి పడుతున్న నేతలు సత్యకుమార్ ను పోగడ్తలతో ముంచెత్తారు. సోము వీర్రాజుకు కనీస సమాచారం లేకపోవడం.. ఆయన అనుకూలమైన నేతలెవరికీ పిలుపులేకపోడంతో… ఇది సోము వీర్రాజు వ్యతిరేక వర్గీయుల సమావేశంగా చెప్పుకుంటున్నారు. ఓరంగా వీరంతా వైసీపీకి వ్యతిరేకంగా ఉండే నేతలని అనుకోవచ్చు. ప్రో వైసీపీ.. ,బీజేపీ నేతల పోరులో ప్రో వైసీపీ నేతలను ఒంటరి చేసే కార్యక్రమం ఏపీ బీజేపీలో ప్రారంభమైందన్న అభిప్రాయం వినిపిస్తోంది.