ఒక ప్రశ్నకు సమాధానంగా మారో ప్రశ్న అడగటం ఈ మధ్య కొంతమంది నాయకులకు బాగా అలవాటు అయిపోయింది. మీడియా ముందుకు రాగానే మైకావేశంలో ఏదైనా మాట్లాడెయ్యొచ్చు అనేట్టుగా కొంతమంది తీరు ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ లో భాజపా నాయకులు కొన్ని ప్రత్యేక రాజకీయ వాతావరణ పరిస్థితుల మధ్య ఉంటున్న సంగతి తెలిసిందే! నిజానికి, భాజపా కేంద్రంలో అధికారంలో ఉన్నా.. ఆంధ్రాలో బీజేపీ నేతలు చంద్రబాబు చాటున ఉండాల్సి వస్తోందన్నది ఓపెన్ సీక్రెట్. అందుకే, వారు పెద్దగా విమర్శించినా ఎవ్వరూ పట్టించుకోరు. చంద్రబాబు సర్కారూ స్పందించదు. ఇక, మీడియాలో ఒక బలమైన వర్గం కూడా వారిని ప్రశ్నించే ప్రయత్నం చెయ్యదు! ఇంతకీ ఇప్పుడు సందర్భం ఏంటంటే.. ఆంధ్రాకి కాంగ్రెస్ చేసిన అన్యాయం గురించి ఏపీ భాజపా నేత సోము వీర్రాజు స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన మేలేంటో చెప్పగలరా అంటూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి సవాలు విసిరారు. అంతేకాదు, ఇదే అంశమై బహిరంగ చర్చకు ఆయన సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ తీరు వల్లనే ఏపీ ఇవాళ్ల ఎన్నో అవస్థలు పడాల్సి వస్తోందనీ, సమస్యల కోరల్లో కొట్టుమిట్టాడాల్సిన స్థితి వచ్చిందని వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
రైట్.. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాకి అన్యాయమే చేసిందనే అనుకుందాం. అది గతం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాకపోవడమే ప్రజాగ్రహానికి నిదర్శనం. ఇప్పుడు అధికారంలో ఉన్నది భాజపా కదా! ఏపీ భాజపా నేతలు ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించొచ్చు. కాంగ్రెస్ చేసిన తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చెయ్యొచ్చు. హోదాకు బదులుగా వచ్చిన ప్యాకేజీ సరిపోదనీ ప్రాథమ్యాలను మార్చాలని, ఏపీకి మరిన్ని నిధులను మంజూరు చెయ్యాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావొచ్చు. కానీ, ఆ పని చేస్తున్నారా..?
రాష్ట్రం కోసం ఏపీ భాజపా నేతలు చేసిన ప్రయత్నాలేవీ..? ప్రత్యేక హోదా విషయంలో వారు చూపిన శ్రద్ధ ఏదీ..? అంతెందుకు, రైల్వే జోన్ విషయంలో ఈ మధ్య ఏపీ భాజపా నేతలు వినతి పత్రాలతో కాస్త హడావుడి చేశారు. మమ అనిపించుకున్నారే తప్ప.. ఆ తరువాత ఫాలో అప్ ఏది..? ఈ ఒక్క ప్రయత్నం చాలు.. ఏపీ భాజపా నేతల చిత్తశుద్ధిని అర్థం చేసుకోవడానికి. ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ మోడీ దగ్గర ఫిర్యాదులు చెయ్యడం తప్ప… ఆయన దగ్గర రాష్ట్ర సమస్యలు ప్రస్థావించి, ఒత్తిడి పెంచిన సందర్భాలున్నాయా అనే ప్రశ్నకు సోము వీర్రాజు ఏం సమాధానం చెబుతారు! ఎప్పుడో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పై ఇప్పుడీ విమర్శలు ఎందుకు..? భాజపా నేతలుగా తమ ప్రయత్నం ఏంటో చెప్పండి, చాలు. ప్రజలకు కావాల్సింది కూడా ఇదే!