ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి మూడు రోజులు అవుతోంది. కానీ వారు స్టీల్ ప్లాంట్ విషయంలో పార్టీ హైకమాండ్ నుంచి కానీ కేంద్రమంత్రుల నుంచి ఎలాంటి హామీని పొందలేకపోయినట్లుగా తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమైనప్పటికీ.. వారికి ఎలాంటి క్లారిటీ రాలే్దు. జేపీ నడ్డాతో స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించడానికి చాన్స్ కూడా ఇవ్వలేదు. పార్టీ పరమైన వ్యవహారాలపై మాత్రమే తనతో మాట్లాడాలని.. మిగతా విషయాలపై మంత్రుల్ని కలవాలని ఆయన మొహం మీదనే చెప్పినట్లుగా తెలుస్తోంది. వీరెవరూ కాదు.. అమిత్ షాను కలిస్తేనే… ఏపీలో ప్రజలు కాస్తంత నమ్ముతారని అనుకుంటున్నారు.
అందుకే ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంత వరకూ ఖరారు కాలేదు. ఓ వైపు ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం ఊపందుకుంటోంది. మరో వైపు అన్ని రాజకీయ పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆయా పార్టీల నేతలు వ్యతిరేకించడానికి బీజేపీ నేతలు వ్యతిరేకించడానికి స్పష్టమైన తేడా ఉంది. కేందరంలో అధికారంలో ఉన్న పార్టీగా తాము వ్యతిరేకించడం మాత్రమే కాదు.. ఆ నిర్ణయాన్ని ఆపాల్సిన బాధ్యత కూడా ఉంది. కనీసం ప్రయత్నం అయినా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ఏపీ బీజేపీ నేతలు… ఢిల్లీకి వెళ్లారు.
కానీ వారికి స్టీల్ ప్లాంట్ గురించి చెప్పుకునే అవకాశాన్ని పార్టీ హైకమాండ్ కల్పించడం లేదు. ఇప్పుడు వారు ఏపీకి వచ్చి ఏం చెబుతారన్నది ఆసక్తికరమే. స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం అడ్వాన్స్ స్టేజ్‌కు వెళ్లిందని.. ప్రైవేటీకరణ ప్రక్రియను చాలా చురుగ్గా కొనసాగిస్తోందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏపీ బీజేపీ నేతలకు… ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక హోదా అంశంలో ధైర్యంగా సాధ్యం కాదని.. ముగిసిపోయిన అంశమని చెబుతున్నారు కానీ… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మంచిదేనని కేంద్రం నిర్ణయాన్ని మాత్రం సమర్థించలేని పరిస్థితి.