ఏపీలో టీడీపీ , బీజేపీ మధ్య పరస్పర విమర్శలు పెరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం అవినీతి, అరాచకాల్లో మనిగిపోయిందని ఆ పార్టీ అగ్రనేతలు ప్రకటించారని మరి చర్యలెప్పుడు తీసుకుంటారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు .. ఏపీ టీడీప అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పదే పదే ఈ విషయాలను ప్రకటిస్తున్నారు. దీనిపై ఏపీ బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. గతంలో పరిస్థితుల్ని చూపించి….అప్పుడు మీరేం చేశారని ప్రశ్నిస్తున్నారు.
సోము వీర్రాజుతో పాటు ఆయన వర్గంగా పేరు పడిన నేతలు వింత వాదనతో తెరపైకి వస్తూండటంతో.. ఏపీ బీజేపీ నేతలు జగన్ వైపే ఉన్నారని టీడీపీ నేతలు క్లారిటీకి వస్తున్నారు. నిజానికి బీజేపీతో పొత్తును టీడీపీ నేతలు కోరుకోవడం లేదు. కానీ.. తమ మద్దతు కావాలంటే.. కనీసం న్యూట్రల్ గా ఉండాలన్న సందేశాన్ని వారి హైకమాండ్ కు ఇచ్చి వచ్చారు. అయితే… ఆ తర్వాత కూడా జగన్ కు సహకారం పెరుగుతోంది. టీడీపీ హయాంలో ఇవ్వాల్సిన నగదు ఇవ్వకుండా ఇప్పుడు దుబారా చేసేందుకు ఇస్తున్నారని అంటున్నారు. ఇతర విషయాల్లోనూ మేలు చేస్తున్నారని అంటున్నారు.
పొత్తులు ఉంటాయనుకున్న పార్టీల మధ్య ఇలా మాటల మంటలు పెరుగుతూండటంతో.. ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ కూడా బీజేపీ గురించి వ్యతిరేక కామెంట్లే చేస్తున్నారు. ఆ పార్టీతో పొత్తులు ఉంటే.. కొన్ని వర్గాలు దూరమవుతాయని అంటున్నారు.