భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల భాజపా నేతలతో డిల్లీలో సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాలలో పార్టీ పరిస్థితిని సమీక్షించి, పార్టీని బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికలకి పార్టీని సిద్దం చేయడం ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. గతంలో కూడా ఆయన ఇటువంటి సమావేశాలు నిర్వహించారు కానీ పార్టీ పరిస్థితిలో, పార్టీ నేతల వైఖరిలో గానీ పెద్దగా మార్పులేవీ కనబడలేదు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తి విభిన్నమైన పరిస్థితులని భాజపా ఎదుర్కోవలసి వస్తోంది. తెలంగాణాలో తెరాసతో పొత్తులు లేకపోవడం వలన తెరాస ప్రభుత్వాన్ని డ్డీ కొనడానికి రాష్ట్ర భాజపా నేతలు సంకోచించనవసరం లేదు కనుక గట్టిగానే పోరాడుతున్నారు కానీ తెరాస ధాటికి వారు నిలువలేకపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాజపా కూడా భాగస్వామిగా ఉండటం రాష్ట్ర భాజపా నేతల నోళ్ళు కుట్టేసినట్లయింది. అయినప్పటికీ వారిలో ఒకవర్గం తెదేపాని విమర్శిస్తుంటే, మరొకటి గట్టిగా వెనకేసుకొని వస్తూ పొగుడుతోంది. దాని వలన భాజపా నేతలు చాలా అయోమయంలో ఉన్నట్లు వారే స్వయంగా చాటుకొంటున్నట్లుంది. బహుశః ఈ అయోమయం కారణంగానే రాష్ట్ర భాజపా అధ్యక్షుడి నియామకం కూడా చేయలేకపోతోందని చెప్పక తప్పదు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడినే నియమించుకోలేకపోతునప్పుడు, ఇంక రాష్ట్రంలో పార్టీని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడం అంటే ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లే ఉంటుంది.
ఈ నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల భాజపా ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం అవుతున్నారు. పార్టీని బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికలకి పార్టీని సిద్దం చేయడం వంటి పడికట్టు పదాలు వల్లించడంతో సరిబెట్టకుండా ఈ సమావేశంలో తెలంగాణాలో తెరాసని ఏవిధంగా కట్టడి చేయాలి? ఏపిలో తెదేపాతో ఎటువంటి వైఖరి అవలంభించాలి? ఏపి భాజపా అధ్యక్షుడి నియామకం వంటి అంశాలపై నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకొంటే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. అందరూ కలిసి కొత్తగా ఏదయినా ఆలోచన, వ్యూహం రూపొందించుకోలేకపోతే ఇటువంటి “కీలక సమావేశాలు” అన్ని సార్లు నిర్వహించినా ప్రయోజనం ఉండదు.